‘రోబో 2.0’ సినిమా గుర్తుందా? అందులో ప్రధాన అంశం ఏంటి? మొబైల్స్ లోంచి వచ్చే రేడియేషన్! దాని వల్ల పక్షులకి జరుగుతోన్న తీరని నష్టం! అయితే, అదంతా సినిమా మాత్రమే అనుకుంటే పొరపాటే. రేడియేషన్ వల్ల మానవజాతి, అలాగే, పశువులు, పక్షులు,ఇతర జీవజాతులు, చెట్లు, చేమలు కూడా పూడ్చుకోలేని నష్టాన్ని నెత్తిన మోస్తున్నాయి. ఇప్పటికే చాలా అధ్యయనాలు క్యాన్సర్, హృద్రోగాలు, డయాబిటిస్ వంటివి ఎలక్ట్రో మ్యాగ్నటిక్ పొల్యూషన్ వల్ల పెరుగుతున్నాయని చెబుతున్నాయి. అయినా ప్రపంచ వ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ దిగ్గజాలు 4జీ తరువాత 5జీ టెక్నాలజీ కోసం తహతహలాడుతున్నాయి. ఇండియాలో కూడా త్వరలో అత్యాధునిక హై స్పీడ్ 5జీ సాంకేతిక అందుబాటులోకి రానుంది!
5జీ టెక్నాలజీ వల్ల లాభాలు బోలెడు ఉన్నాయని చాలా మంది చెబుతున్నారు. కానీ, నష్టాలు అంతకంటే ఎక్కువని మరికొందరు వాదిస్తున్నారు. 5జీ వస్తే ఇవాళ్ల మనం చూస్తున్న ప్రపంచం స్వరూపమే మారిపోతుందట. ఇంటర్నెట్ మరింతగా మన జీవితాల్ని శాస్తిస్తుంది. కానీ, ఆరోగ్యపరమైన, జన్యు పరమైన తీవ్ర సమస్యలు తలెత్తుతాయని వాతావరణ పరిరక్షణ ఉద్యమకారులు అంటున్నారు. ఈ కారణం చేతనే బాలీవుడ్ సీనియర్ నటి జూహి చావ్లా ఢిల్లీ హైకోర్ట్ మెట్లు ఎక్కింది. ఆమె 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసింది. జూన్ 2న తదుపరి విచారణ చోట చేసుకోనుంది.
5జీ వ్యవహారంపై కోర్టుకు వెళ్లిన జూహీ తాను కొత్త సాంకేతికతకి వ్యతిరేకం కాదని చెప్పింది. అయితే, మనకి, మనతో పాటూ భూమ్మీద ఉంటోన్న పశు, పక్ష, వృక్షాలకి చేటు చేసేది ఎలా స్వాగతిస్తామని ప్రశ్నిస్తోంది! అలాగే రాబోయే తరాల జీవరాశులు, మానవులు కూడా 5జీ వల్ల నష్టపోతారని ఆమె భావిస్తోంది. అందుకే, ప్రభుత్వం తరుఫున 5జీ వల్ల ఎటువంటి నష్టం ఉండదని హామీ కావాలంటూ… జూహి తరుఫు న్యాయవాది కోర్టును ఆశ్రయించాడు. చూడాలి మరి, జూహి నెత్తికెత్తుకున్న వాతవరణ పరిరక్షణ ఉద్యమం కోర్టు హాలులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో!