ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న నేపథ్యంలో, హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సొసైటీ నిర్ణయించింది. ఈ ముగ్గురు ప్రముఖులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారని, అయితే వారిని వదిలేసి యూట్యూబర్లను మాత్రమే టార్గెట్ చేయడం సబబు కాదని సొసైటీ ఆరోపిస్తోంది. గత కొన్ని నెలలుగా తెలంగాణలో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, చిన్న సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. వీరిలో హర్ష సాయి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, శ్యామల వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Raghubabu: కన్నప్ప సినిమా ట్రోల్ చేశారంటే.. రఘుబాబు సంచలన వ్యాఖ్యలు
అయితే, ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పెద్ద సెలబ్రిటీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. షారుఖ్ ఖాన్ గతంలో పలు ఆన్‌లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అలాగే, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి క్రికెట్ స్టార్లు ఫాంటసీ స్పోర్ట్స్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జించారని సొసైటీ ఆరోపిస్తోంది. ఈ యాప్స్ కూడా బెట్టింగ్‌కు సంబంధించినవేనని, వీటి వల్ల యువత తప్పుదారి పట్టిందని వారు వాదిస్తున్నారు. “ఇంత పెద్ద స్థాయి సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తే వారి అభిమానులు వాటిని నమ్మి మోసపోతారు. కానీ, పోలీసులు వీరిని వదిలేసి చిన్న చిన్న యూట్యూబర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరికాదు,” అని సొసైటీ ప్రతినిధి ఒకరు తెలిపారు.