రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) మ్యూజికల్ నైట్ కార్యక్రమం విశాఖపట్నంలో జరగాల్సి ఉండగా, చివరి క్షణంలో అనుమతుల సమస్యలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఏప్రిల్ 19న జరగాల్సిన ఈ మ్యూజికల్ కాన్సర్ట్‌కు విశాఖ పోలీసులు భద్రతా కారణాలతో అనుమతులు నిరాకరించడంతో నిర్వాహకులు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు. విశాఖలోని విశ్వనాథ్ కన్వీన్షన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించాలని మొదట నిర్ణయించారు. అయితే, ఇటీవల ఈ వేదికలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. గతంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్‌లోని వాటర్ వరల్డ్‌లో జరిగిన ఒక దుర్ఘటనలో ఒక బాలుడు మృతి చెందిన ఘటన నేపథ్యంలో, అధికారులు ఈ ప్రదేశాన్ని తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కారణంగా, విశాఖ పోలీసులు నాలుగు సార్లు ఈ మ్యూజికల్ నైట్‌కు అనుమతులను తిరస్కరించారు. సిపి శంఖబ్రత బాగ్చీ ఈ నిర్ణయం వెనుక భద్రతా సమస్యలే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
Shine Tom Chako: డ్రగ్స్ రైడ్ తప్పించుకునేందుకు సాహసం.. 3వ ఫ్లోర్ నుంచి దూకి మరీ పరార్!
పోర్ట్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. స్టేడియం సామర్థ్యం కేవలం 3,000 మంది మాత్రమే కాగా, నిర్వాహకులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో సుమారు 10,000 టికెట్లను అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో భద్రతా సమస్యలు ఉంటాయని భావించి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్కింగ్ సమస్యలతో పాటు, ఏదైనా ప్రమాదం జరిగితే ఈవెంట్ ప్రాంతం నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. అయితే అనుమతులు లేకపోయినప్పటికీ, దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. ఆయన అభిమానులు ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. టికెట్లు భారీగా అమ్ముడైన నేపథ్యంలో, చివరి క్షణంలో అనుమతులు రద్దు కావడంతో నిర్వాహకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్ విశాఖలో జరిగే అవకాశం ప్రస్తుతానికి సందిగ్ధంగానే ఉంది. భద్రతా సమస్యలను పరిష్కరించి, తగిన అనుమతులు పొందేందుకు నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది త్వరలో తేలనుంది.