(ఆగస్టు 22న ‘గోకులంలో సీత’కు 25 ఏళ్ళు)
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘గోకులంలో సీత’ అంటే అందరూ ఆశ్చర్యపోవచ్చు. అంతకు ముందే ఆయన ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’తో హీరోగా పరిచయం అయ్యాడు కదా అనీ అనవచ్చు. అయితే ఆ సినిమాలో ఆయన పేరు కేవలం కళ్యాణ్ మాత్రమే. ‘గోకులంలో సీత’ తోనే ‘పవన్’ అన్న పేరు కళ్యాణ్ ముందు చేరింది. కావున పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘గోకులంలో సీత’. ఈ చిత్రం 1997 ఆగస్టు 22న విడుదలయింది. ఈ సినిమా చిరంజీవి పుట్టినరోజయిన ఆగస్టు 22న విడుదల కావడం విశేషం! చిరంజీవి బర్త్ డే కు రిలీజయిన ఏకైక చిత్రం ‘చంటబ్బాయ్’ పరాజయం పాలయింది. దాంతో ‘గోకులంలో సీత’ ఏమవుతుందో అనే ఆందోళన అభిమానుల్లో ఉండేది. అయితే వారికి ఆనందం పంచుతూ ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
‘గోకులంలో సీత’ కథ ఏమిటంటే – కోటీశ్వరుడైన ముద్దుక్రిష్ణయ్యకు కళ్యాణ్ ఒక్కగానొక్క కొడుకు. తల్లిలేని బిడ్డ కావడంతో అతిగారాబంగా పెంచుతాడు. దాంతో కళ్యాణ్ కు చెడు తిరుగుళ్ళు అలవాటవుతాయి. ప్రేమ అంటే అతనికి నమ్మకం ఉండదు. అలాంటి కళ్యాణ్, ఓ సారి వేదికపై పాట పాడే శిరీషను చూస్తాడు. ఆమె అందానికి ఆకర్షితుడవుతాడు. ఎలాగైనా ఆమెను బుట్టలో వేసుకోవాలని భావిస్తాడు. తన కంపెనీలోనే పనిచేసే మిత్రుడు భాస్కర్ అంటే కళ్యాణ్ కు ఎంతో అభిమానం. భాస్కర్ కూడా శిరీషను ప్రేమిస్తాడు. భాస్కర్ అంటే శిరీష కూ ఇష్టం కలుగుతుంది. కానీ, శిరీష తల్లి ఆమెకు వేరే పెళ్ళి చేయాలనుకుంటుంది. భాస్కర్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న కళ్యాణ్ ఆమెను రక్షించి, అతని దగ్గరకు తీసుకు వస్తాడు. కానీ, భాస్కర్ కన్నవారు శిరీషతో పెళ్ళికి ఇష్టపడరు. ఆమెను నానా మాటలు అంటారు. దాంతో భాస్కర్ తండ్రిపై కళ్యాణ్ చేయి చేసుకుంటాడు. ఎటు వెళ్ళాలో తెలియని శిరీషను తన ఇంటికే తీసుకు వెడతాడు కళ్యాణ్. అతని ఇంట్లో ఉండడం వల్ల ఆమెను జనం నానా మాటలు అంటారు. ఆమె వల్ల అతనిలో ఎంతో మార్పు వస్తుంది. కళ్యాణ్, శిరీషను పెళ్ళాడాలని నిశ్చయించుకుంటాడు. అతని తండ్రి ముద్దు క్రిష్ణయ్యకు కూడా శిరీష అంటే అభిమానం కలుగుతుంది. ఆమెతో కొడుకు పెళ్ళి ఇష్టమే అంటాడు. అయితే ఆమెను ఓ లేడీ డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళి కన్యత్వ పరీక్ష చేయిస్తాడు. అది తెలిసిన శిరీష వారిని అసహ్యించుకొని తన ఇంటికి పోతుంది. ఈ విషయం తెలిసి కళ్యాణ్ ఆమెను క్షమించమని అడగడానికి వెళతాడు. అతడిని శిరీష ఇంట్లో వాళ్ళు అవమానిస్తారు. శిరీష ఇంటిముందే కళ్యాణ్ నిరాహార దీక్ష చేస్తాడు. హరి అనేవాడు వచ్చి బలవంతంగా శిరీషను తీసుకువెడుతూ, కళ్యాణ్ ను చితక్కొడతాడు. అయితే శిరీష తనను రక్షించమని వేడుకోగానే కళ్యాణ్ అందరినీ చావగొడతాడు. శిరీషకు క్షమాపణ చెప్పి వెళ్తున్న కళ్యాణ్ ను కౌగిలించుకుంటుంది. ముద్దుక్రిష్ణయ్యనే స్వయంగా వచ్చి కొడుక్కి తాళి ఇచ్చి, ఆమె మెడలో కట్టమంటాడు. దాంతో కథ సుఖాంతమవుతుంది.
శ్రీపద్మసాయి చిత్ర పతాకంపై జి.వి.జి.రాజు సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఇందులో పవన్ కళ్యాణ్, రాశి, కోట శ్రీనివాసరావు, హరీశ్, సుధాకర్, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, శ్రీహరి, అచ్యుత్, నాగరాజు, కళ్ళు చిదంబరం, కె.కె., రమణారెడ్డి, సంగీత, రక్ష, రాధాప్రశాంతి నటించగా, రాళ్ళపల్లి, ఆలీ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అగస్త్యన్ రాసిన కథకు పోసాని కృష్ణమురళి మాటలు పలికించారు. సీతారామశాస్త్రి, భువనచంద్ర రాసిన పాటలకు కోటి స్వరకల్పన చేశారు. నార్జాల దాశరథి, బి.శ్రీనివాసరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులోని “గోకుల కృష్ణా…గోపాల కృష్ణా…” పాట అన్నిటి కంటే హైలైట్ అని చెప్పవచ్చు. “ఊ అంది పిల్లా…”, “అందాల సీమలోని…”, “పొద్దేరాని లోకం నీది…”, “హే పాపా…”, “మనసున్న కనులుంటే…”, “ప్రేమా ప్రేమా ఓ ప్రేమా…” అంటూ సాగే పాటలూ అలరించాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి, శతదినోత్సవాలు చూసింది.
Earthquake: రాజస్థాన్ లో భూకంపం.. 4.1 తీవ్రతతో కంపించిన భూమి