‘ద రాక్’గా ఒకప్పుడు దుమారం రేపిన టాప్ రెస్లర్ డ్వేన్ జాన్సన్. ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే, ద రాక్ తొలిసారి వాయిస్ అందించబోతున్నాడు. అదీ ఓ యానిమెటెడ్ మూవీలో కుక్క పాత్రకి! అయితే, అది మామూలుగా డాగ్ కాదట. సూపర్ డాగ్ ‘క్రిప్టో’ అంటున్నారు!
డీసీ కామిక్స్ వారి ‘లీగ్ ఆఫ్ సూపర్ పెట్స్’ మూవీకి డ్వేన్ జాన్సన్ కూడా ఒక నిర్మాత. ఆయన ‘సెవన్ బక్స్ ప్రొడక్షన్స్’తో కలసి వార్నర్ బ్రదర్స్ సంస్థ ‘లీగ్ ఆఫ్ సూపర్ పెట్స్’ 2022లో విడుదలకి సిద్ధం చేస్తుంది. జాన్సన్ మాత్రమే కాకుండా సినిమాలోని ఇతర పాత్రలకి మరికొందరు హాలీవుడ్ నటీనటులు గాత్రం అందిస్తారట. డీసీ కామిక్స్ నుంచీ వస్తుండటంతో ‘లీగ్ ఆఫ్ సూపర్ పెట్స్’ మూవీపై మంచి అంచనాలున్నాయి.
జాన్సన్ తన గొంతు అరువు ఇవ్వబోతోన్న ‘క్రిప్టో – ద డాగ్’ ఈనాటిది కాదు. 1955లో ‘అడ్వెంచర్ కామిక్స్’లో క్రిప్టో తొలిసారి కనిపించింది. అప్పట్నుంచీ చాలా మందికి ఫేవరెట్ గా మారింది. ఇప్పుడు ‘లీగ్ ఆఫ్ సూపర్ పెట్స్’లోనూ క్రిప్టోది కీలక పాత్రే! దానికి తన వాయిస్ అందిస్తోన్న డ్వేన్ జాన్సన్ అలియాస్ ద రాక్… మరో డీసీ మూవీ కూడా చేస్తున్నాడు. అదే ‘బ్లాక్ ఆడమ్’. ఈ సినిమా వచ్చే సంవత్సరం జూలై 29న విడుదలవుతోంది. అంతకంటే ముందే, ‘లీగ్ ఆఫ్ సూపర్ పెట్స్’ 2022 మే 20న బాక్సాఫీస్ వద్దకొస్తుంది! చూడాలి మరి ‘ద రాక్’ రాకింగ్ వాయిస్ యానిమేషన్ మూవీకి ఎంత వరకూ క్రేజ్ తెచ్చి పెడుతుందో!