Costume Krishna: ‘కాస్ట్యూమ్స్’ కృష్ణ పేరు వినగానే ఆయన విలక్షణమైన వాచకం ముందుగా గుర్తుకు వస్తుంది. ఆ తరువాతే ఆయన అభినయమూ స్ఫురిస్తుంది. వెరసి విలక్షణ నటునిగా జనం మదిలో చోటు సంపాదించారాయన. అయితే అంతకు ముందే చిత్రసీమలో తన కాస్ట్యూమ్స్ డిజైనింగ్ తో ఎంతోమంది మేటి నాయికలకు దుస్తులు సమకూర్చి పేరు సంపాదించారు కృష్ణ. అందువల్లే ఆయన పేరు ముందు ‘కాస్ట్యూమ్స్’ తిష్ట వేసుకుంది. విలక్షణంగా కనిపించేవారిని, నాటకానుభవం ఉన్నవారిని తమ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఉత్సాహం ప్రదర్శించేవారు కొందరు దర్శకనిర్మాతలు. అలాంటి వారిలో దాసరి నారాయణరావు, ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ ముందుగా గుర్తుకు వస్తారు. కోడి రామకృష్ణ రూపొందించిన ‘భారత్ బంద్’ చిత్రం ద్వారానే కాస్ట్యూమ్స్ కృష్ణ నటునిగా పరిచయం అయ్యారు.
కాస్ట్యూమ్స్ కృష్ణ విజయనగరం జిల్లా లక్కవరపు కోటలో 1940లో జన్మించారు. కళల కాణాచి అయిన విజయనగరంలో తొలుత సంగీత సాధన చేయాలని తపించారు. అయితే తన స్వరం బాగోలేదని ఆయనే గ్రహించి, కొన్ని నాటకాలను చూస్తూ వాటిపై ఆసక్తి పెంచుకున్నారు. చిన్నతనంలో పౌరాణిక నాటకాలు చూస్తూ, నటీనటులు ధరించిన కిరీటాలు, దుస్తులపై ఆకర్షణ కలిగింది. తన మిత్రులతో కలసి కాగితం కిరీటాలను తయారు చేసి ధరించి, నాటకాల్లో లాగే నటించేవారు. ఇక ఇంట్లోవాళ్ళ దుస్తులతో రకరకాల గెటప్స్ వేసేందుకు ప్రయత్నించేవారు. ఆయనలోని ఆ ఆసక్తిని గమనించిన పెద్దవారు ప్రోత్సహించారు. ఆ తరువాతి రోజుల్లో అదే తనకు బ్రతుకుతెరువు అవుతుందని ఆ రోజున కృష్ణకు తెలియదు.
సినిమా రంగంపై ఆసక్తితో తనకు అబ్బిన కళను అక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేశారు కృష్ణ. ప్రముఖ చిత్రకారుడు, పబ్లిసిటీ డిజైనర్ గంగాధర్ కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనింగ్ చేశారు. అప్పుడు ఆయనకు దుస్తులు కుట్టించడంలో కృష్ణ సహాయపడేవారు. అలా అలా ఆ రోజుల్లో పేరున్న కాస్ట్యూమ్ డిజైనర్స్ కు సహాయకునిగా ఉన్న కృష్ణ, తరువాతి రోజుల్లో హీరోయిన్స్ కు అందమైన దుస్తులు సమకూర్చసాగారు. దాంతో మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాది నాయికల దుస్తులు పరిశీలించి, దక్షిణాది భామలకు తగ్గ కాస్ట్యూమ్స్ రూపొందించేవారు. హిందీ చిత్రాలలో ముంతాజ్ ధరించిన డ్రెస్సులను అనుసరిస్తూ నాటి మేటి నాయిక వాణిశ్రీకి కాస్ట్యూమ్స్ రూపొందించేవారు. తరువాతి రోజుల్లో వాణిశ్రీకి పర్సనల్ గానూ పనిచేశారు కృష్ణ. నటునిగా బిజీ అయిన తరువాత కొన్ని చిత్రాలలో వాణిశ్రీతోనే కలసి నటించారు. “అంతా… అమ్మ పెట్టిన భిక్ష…”అంటూ చెప్పుకొనేవారు.
‘భారత్ బంద్’లో కృష్ణ వాచకం కూడా భలేగా ఆకట్టుకుంది పైగా అందులో ఆయన మెయిన్ విలన్. అందుకు తగ్గ అభినయం ప్రదర్శిస్తూ “తాగినప్పుడూ…కోపమొచ్చినప్పుడూ… కడుపులోదంతా కక్కేయాలి…లేకపోతే చిల్లుపడిపోతుంది…” అంటూ చెప్పిన డైలాగ్స్ జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఆ చిత్రం ఘనవిజయం సాధించడమే కాదు, కాస్ట్యూమ్స్ కృష్ణను నటునిగా నిలిపింది. ఆ తరువాత తనకు ఎంతో పేరు సంపాదించి పెట్టిన అసలైన కాస్ట్యూమ్స్ వృత్తిని వదిలేసి, నటనలోనే ఆయన సాగేలా చేసింది. కృష్ణలోని అభినయం ఆకట్టుకోవడంతో అంతకు ముందు ఆయనతో పరిచయమున్న దర్శకనిర్మాతలు సైతం నటునిగా అవకాశాలు కల్పించారు. అలా “అల్లరి మొగుడు, విలన్, కొండపల్లి రాజా, ఖైదీ బ్రదర్స్” వంటి చిత్రాలలో విలక్షణమైన అభినయం ప్రదర్శించారు. అయితే కోడి రామకృష్ణ చిత్రాలలోనే కృష్ణకు ఆకట్టుకొనే పాత్రలు లభించాయని చెప్పవచ్చు.
కోడి రామకృష్ణ తాను పరిచయం చేసిన వారికి తన ఇతర చిత్రాల్లోనూ అవకాశాలు కల్పిస్తూ సాగారు. అదే తీరున కాస్ట్యూమ్స్ కృష్ణకు కోడి రామకృష్ణ తాను రూపొందించిన అనేక చిత్రాలలో అవకాశాలు కల్పించారు. తనను నటునిగా మలచిన కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే కృష్ణ ‘ఎస్.ఆర్.ఎస్. ఆర్ట్ మూవీస్’ పతాకంపై ‘పెళ్ళిపందిరి’ చిత్రాన్ని నిర్మించారు. జగపతిబాబు హీరోగా రూపొందిన ఈ సినిమా మంచి లాభాలు చూసింది. ఈ చిత్రాన్ని నైజామ్ లో పంపిణీచేసిన దిల్ రాజు, ఆ సినిమా ఓవర్ ఫ్లోస్ కు తగ్గ మొత్తాన్ని కృష్ణను వెదుక్కుంటూ మరీ అందించారు. అది చూసి ఆశ్చర్యపోయిన కృష్ణ, “ఇలాంటి నిజాయితీ పరులు… ఈ రోజుల్లోనూ ఉన్నారా? మీరు తప్పకుండా చిత్రసీమలో ఓ స్థాయికి వస్తారు…” అని అన్నారు. దిల్ రాజు నిజాయితీకి కృష్ణ ఆశీస్సులు ఫలించి, నేడు ఆయన టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా సాగుతున్నారు. తరువాత కూడా కాస్ట్యూమ్స్ కృష్ణ మరికొన్ని చిత్రాలను నిర్మించారు.
అందరితోనూ ఎంతో ఆత్మీయంగా ఉంటూ అందరివాడు అనిపించుకున్న కాస్ట్యూమ్స్ కృష్ణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏప్రిల్ 2న చెన్నైలో కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు చిత్రప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.