బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి, బిగ్ బాస్ ఫేమ్ మరియు ఫుడ్ బ్లాగర్ టేస్టీ తేజ సీఐడీ విచారణను ఎదుర్కొన్నారు. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు నమోదు అయిన తర్వాత హర్ష సాయి విదేశాలకు పారిపోయినట్లు సమాచారం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులోనూ విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టిన హర్ష సాయిని, తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని సీఐడీ హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో, మూడు రోజుల క్రితం హర్ష సాయి సీఐడీ విచారణకు హాజరయ్యారు. సీఐడీ అధికారులు అతన్ని నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.
Also Read :12A Railway Colony Review: ’12ఏ రైల్వే కాలనీ’ రివ్యూ
బిగ్ బాస్ ఫేమ్, ఫుడ్ బ్లాగర్ టేస్టీ తేజ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. పలు బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్ యాప్‌లను తేజ ప్రమోట్ చేసినట్లు సీఐడీ గుర్తించింది. ముఖ్యంగా, తను చేసే ఫుడ్ బ్లాగ్ వీడియోల్లో కూడా బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు సంబంధించిన ప్రకటనలు ఇచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఏయే యాప్‌లకు ఎంత మొత్తంలో డబ్బులు తీసుకుని ప్రచారం చేశారనే వివరాలపై అధికారులు తేజను ప్రశ్నించారు. టేస్టీ తేజను సీఐడీ అధికారులు రెండు గంటలపాటు విచారించారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా జరుగుతున్న ఆర్థిక మోసాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రమోషన్లలో పాల్గొన్న మరికొంత మంది ప్రముఖులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.