అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ’12ఏ రైల్వే కాలనీ’. పొలిమేర దర్శకుడు అనిల్ కథ అందించగా నాని అనే కొత్త దర్శకుడు దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
కథా సంగ్రహం
కార్తీక్ (‘అల్లరి’ నరేష్) ఒక అనాథ. స్థానిక రాజకీయ నాయకుడు టిల్లు అన్న (జీవన్ కుమార్) అండదండలతో పెరుగుతూ, అతను చెప్పిన పనులు చేస్తుంటాడు. అదే సమయంలో, తన ఇంటి పక్కనే ఉండే ఆరాధన (డాక్టర్ కామాక్షి భాస్కర్ల) వెంట పడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో, టిల్లు అన్న చెప్పిన ఓ పని చేయడానికి కార్తీక్ రహస్యంగా ఆరాధన ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ ఇంట్లో కార్తీక్ షాక్ అయ్యి పడిపోతాడు. అంతలా కార్తీక్ షాక్ అయ్యే దృశ్యం ఏమిటి? ఆరాధన నివాసంలో జరిగిన భయానక సంఘటనలు ఏమిటి? చివరకు కార్తీక్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది మిగతా కథ.
విశ్లేషణ
హాస్యాన్ని పక్కనబెట్టి, తన ద్వితీయ ఇన్నింగ్స్‌లో విభిన్న కథాంశాలతో ముందుకు వెళ్తున్న ‘అల్లరి’ నరేష్ ఈ సినిమాతో కూడా అంచనాలు ఏర్పడేలా చేసుకున్నాడు. ఈ చిత్రానికి ‘పొలిమేర’ చిత్రాల దర్శకుడు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ వంటి బాధ్యతలు నిర్వహించడం – ఆయనా, నరేష్ కలిసి పనిచేయడం కారణంగా ఈ సినిమాపై గట్టి అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ హాఫ్) మొత్తం నరేష్ మరియు అతని స్నేహితుల సన్నివేశాలు, హీరోయిన్‌ను వెంబడించడం వంటి రొటీన్ గా సాగుతుంది. స్నేహితుల మధ్య వచ్చే సీన్లు, తాగడం, తిరగడం వంటివి చిన్న సినిమాల్లోని సన్నివేశాలే. ఇంటర్వెల్ వచ్చే వరకు సినిమాను ఏదో నెట్టుకొస్తున్న భావన కలుగుతుంది, అనవసరంగా సాగదీసినట్టు అనిపిస్తుంది. తొలి భాగంలో చాలా సీన్లను, పాటలను తొలగించవచ్చు. సెకండ్ హాఫ్ కథ ఆసక్తికరంగా మారినా, మలుపులు ట్విస్ట్‌లు వెల్లడి అయినప్పటికీ, కథా పరంగా చూస్తే పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లేతో కన్ఫ్యూజన్ కలిగించారు. కథాంశం మొత్తం ద్వితీయార్థంలోనే చెప్పాలని ప్రయత్నించడం వల్ల కొన్ని చోట్ల సాగదీత స్పష్టంగా కనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మరొక అనూహ్య మలుపు ఉన్నప్పటికీ, అది కూడా సులభంగా ఊహించే విధంగానే ఉంది. మంచి థ్రిల్లింగ్ కథాంశాన్ని ఎంచుకున్నప్పటికీ, రొటీన్ సన్నివేశాలు, అసంబద్ధమైన అంశాలతో సరిగ్గా వాడుకోలేదు అనిపిస్తుంది.
నటన విషయానికి వస్తే అల్లరి నరేష్ రెండు విభిన్న పార్శ్వాల్లో (షేడ్స్) కనిపించడం బాగుంది. నటుడిగా అల్లరి నరేష్ తన పాత్రలో చక్కటి ప్రదర్శన కనబరిచారు. సాయి కుమార్ నటన కూడా బాగుంది. హీరోయిన్ డాక్టర్ కామాక్షి భాస్కర్ల కూడా తన పాత్రలో బాగా నటించింది. ‘వైవా’ హర్ష, ‘గెటప్’ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి సహా మిగిలిన నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా మెప్పించారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే, రచయిత డాక్టర్ అనిల్ విశ్వనాథ్, దర్శకుడు నాని కాసరగడ్డ ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు తగినంత ఆసక్తిని, మంచి ట్రీట్‌మెంట్‌ను జోడించలేకపోయారు. సినిమాటోగ్రఫీ బాగుంది. చిత్రం ప్రారంభ సన్నివేశాలతో పాటు, ద్వితీయార్థంలో వచ్చే కొన్ని కీలక ఘట్టాలను కెమెరామెన్ సహజంగా చూపించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఫైనల్లీ: కొన్ని చోట్ల మాత్రమే థ్రిల్ పంచే 12ఏ రైల్వే కాలనీ’