అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందాన, నిన్న మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వార్తను ఎవరో ఒకరు తప్పుగా రాయడం మొదలుపెట్టడంతో, సోషల్ మీడియా అంతా అదే హడావుడితో నిండిపోయింది. అసలు విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళం ఇచ్చారని చెబుతూ, ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలుత ఒక ట్వీట్ పడింది. వెంటనే దాన్ని బేస్ చేసుకుని, సోషల్ మీడియాలో వేరే అకౌంట్ల నుంచి ట్వీట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో, కొన్ని వెబ్‌సైట్లు ఏకంగా ఆయన విరాళం అందించారంటూ కథనాలు కూడా వండి వడ్డించాయి. వాస్తవానికి, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి గత ఏడాది విజయవాడ వరదలు వచ్చినప్పుడు 50 లక్షలు ప్రకటించారు.
Also Read : Akhil: స్ట్రైక్ ఎఫెక్ట్.. లెనిన్ మరింత ఆలస్యం
అదే సమయంలో, చిరంజీవి స్వయంగా వెళ్లి చంద్రబాబును కలిసి చెక్కు అందించారు. ఇప్పుడు అదే ఫోటోలు, అదే మేటర్‌ని దాదాపు 11 నెలల తర్వాత మళ్లీ తెరమీదకు తీసుకొచ్చారు. బహుశా అది పొరపాటే అయి ఉండొచ్చు. దాన్ని క్యారీ చేసిన వాళ్లు కూడా దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా వైరల్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి టీం నుంచి కానీ, ఏపీ సీఎంవో నుంచి కానీ, దీని గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కోటి రూపాయలు అమౌంట్ ఇస్తే, ఖచ్చితంగా సీఎంవో నుంచి గానీ, టీం నుంచి గానీ ఏదో ఒక సమాచారం వస్తుంది. కనీసం అవగాహన లేకుండా, సరైన సోర్స్ లేకుండా వార్తలు రాసేస్తూ జనాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయడమే ఇది. అయితే, ఇది అంత హాని కలిగించే విషయం కాదు, కానీ ఇలాంటిదే ప్రజలకు భయాందోళన కలిగించే విషయంలో కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా రాస్తే, వారంతా టెన్షన్ పడే అవకాశం ఉంది. కాబట్టి, ఇక మీదట న్యూస్ క్యారీ చేసే సమయంలో జాగ్రత్త వహించడం మంచిది.