ఇటీవలే యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ అడల్ట్ కామెడీ మూవీ తర్వాత వరుసగా సంతోష్ కు ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే మారుతీ దర్శకత్వంలో ఓటీటీ మూవీకి సంతోష్ కమిట్ అయ్యాడు. అలానే ‘ప్రేమకుమార్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. కొన్ని వెబ్ సీరిస్ లలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత… సంతోష్ శోభన్ హీరోగా ఓ సినిమా నిర్మించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాస్ట్యూమ్ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుస్మిత తన భర్తతో కలిసి చిత్ర నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. తొలియత్నంగా ‘షూట్ అవుట్ ఎట్ ఆలేర్’ను నిర్మించింది సుస్మిత. ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమా తీసే పనిలో పడినట్టు తెలుస్తోంది. తమిళ చిత్రం ‘8 తోట్టక్కల్’ను ఆమె మాతృకకు దర్శకత్వం వహించిన శ్రీగణేశ్ తోనే తెలుగులో రీమేక్ చేయబోతున్నారట. అందులో సంతోష్ శోభన్ హీరోగా నటించే ఆస్కారం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతోందట. మొత్తం మీద దర్శకుడు స్వర్గీయ శోభన్ తనయుడు సంతోష్… నిదానంగా తన కంటూ ఓ గుర్తింపును తెచ్చుకుని టాలీవుడ్ లో ముందుకు సాగుతున్నాడు.