నటసింహ నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ యన్బీకే టాక్ షో వినోదాల విందుగా మారింది. ఇప్పటి దాకా తొమ్మిది ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది అన్ స్టాపబుల్. త్వరలోనే మహేశ్ బాబు అతిథిగా పదవ ఎపిసోడ్ ప్రసారంతో ఫస్ట్ సీజన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ వినోదాల విందులోని కొన్ని ముఖ్యఘట్టాలను ఏర్చి కూర్చి ప్రేక్షకులను ఆనందసాగరంలో ముంచెత్తడానికి ఆహా బృందం ఓ పథకం వేసింది. అందులో భాగంగా ఇప్పటి దాకా ప్రసారమైన తొమ్మిది ఎపిసోడ్స్ లోని జనరంజకమైన సన్నివేశాలను ఓ మాలగా కూర్చి జనం ముందు నిలిపింది. ఈ స్పెషల్ ఎపిసోడ్ గంట 27 నిమిషాల పాటు రూపొందింది.
తొలి ఎపిసోడ్ లో మోహన్ బాబు సందడి. రెండో ఎపిసోడ్ లో నాని అల్లరి. మూడో ఎపిసోడ్ లో బ్రహ్మానందం హాస్య వల్లరి. నాలుగో ఎపిసోడ్ లో అఖండ బృంద విజయనాదం. ఎప్పుడెప్పుడా అని యావద్భారతమూ ఎదురుచూస్తోన్న ట్రిపుల్ ఆర్ రూపశిల్పి రాజమౌళి, ఆ చిత్ర సంగీత దర్శకులు కీరవాణి అయిదో ఎపిసోడ్ లో అలరించిన వైనం. ఆరో ఎపిసోడ్ లో పుష్ప సువాసనల ఘుమఘుమ. రవితేజ, గోపీచంద్ మలినేనితో బాలయ్య సాగించిన సంబరం ఏడో ఎపిసోడ్ లో ఆకట్టుకున్న తీరు. రానా చేసిన రచ్చతో సాగిన ఎనిమిదవ ఎపిసోడ్. లయన్ బాలయ్యను కలసి సందడిచేసిన లైగర్ బృందం హంగామాతో సాగిన తొమ్మిదో ఎపిసోడ్ – ఇప్పటి దాకా మురిపించాయి. వాటి సమాహారంగా రూపొందిన అన్ స్టాపబుల్ స్పెషల్ ఎపిసోడ్ సైతం అభిమానులకు ఆనందం పంచిందనే చెప్పాలి.
వసూల్... వసూల్... పైసా వసూల్... అనే బాలయ్య పైసా వసూల్ పాట ఇప్పటికే అనేక టీవీ షోస్ లో కీలక పాత్ర పోషించింది. ఇక ఒరిజినల్ బాలయ్యనే నిర్వహిస్తోన్న అన్ స్టాబుల్ యన్బీకే టాక్ షోలో అదే పాటతో తొలి ఎపిసోడ్ మొదలైంది. అదే తీరున ఈ స్పెషల్ ఎపిసోడ్ కు కూడా పైసా వసూల్... ఓ కళ తీసుకు వచ్చింది. మొదటి ఎపిసోడ్ లో బాలయ్య, పూర్ణతో వేసిన స్టెప్స్ తో ఈ స్పెషల్ ఎపిసోడ్ మరింత కళగా రూపొందింది. రవితేజ ఎపిసోడ్ లోని నాకు బ్యాంకొద్దు బ్యాంకాక్ కావాలి... అంటే అల్లరి చేయాలి మరి...అనే డైలాగ్ జనాల్లో భలేగా పాపులర్ అయింది. అది తెలిసే ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ఆ సీన్ ను భలేగా చొప్పించారు. మీ సినిమా సైజుకి...మీ బిహేవియర్ కు సంబంధమే ఉండదు... అంటూ రాజమౌళితో బాలయ్య చేసిన సందడికూడా ఇందులో చోటు చేసుకుంది. అఖండ సక్సెస్ కు కారణం మీరా? నేనా? అంటూ బాలయ్య వేసిన ప్రశ్నకు దర్శకుడు బోయపాటి శ్రీను ఇచ్చిన సమాధానం – హండ్రెడ్ పర్సెంట్ కారణం మీరు, నేనే. ఎందుకంటే ప్రపంచానికి మీరు ప్రశ్నేమో...కానీ నాకు సమాధానం... అంటూ అలరించిన తీరును అభిమానులు ఇంకా మరచిపోలేదు. ఆ ముచ్చట ఇందులో చోటు సంపాదించకుండా ఉంటుందా? ఇక పుష్ప టీమ్ లో డైరెక్టర్ సుకుమార్ తో `మీ కన్ఫ్యూజన్ కి నా క్లారిటీకి మూడో నెలల్లో షెడ్యూల్అంటూ బాలయ్య సాగించిన సందడి మళ్ళీ ఇందులో దర్శనమిస్తుంది.మీతో టాక్ షో చేయాలన్న ఐడియా ఎవరికి వచ్చిందో కానీ… హ్యాట్సాఫ్ టు దట్ పర్సన్…“ అంటూ రానా చేసిన రచ్చ కూడా మరోమారు పలకరిస్తుంది. బ్యాంకాక్ వెళ్ళి కథ రాయడం చాలాకష్టం అని పూరి జగన్నాథ్ వివరించిన వైనం మళ్ళీ గిలిగింతలు పెడుతుంది. యన్టీఆర్ కొన్ని ఆదర్శవంతమైన సిద్ధౄంతాలతో పెట్టిన తెలుగుదేశం పార్టీ పగ్గాలను తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకు ఇచ్చావని తొలి ఎపిసోడ్ లో మోహన్ బాబు ప్రశ్నించిన తీరు మళ్ళీ చూపరులకు ఆసక్తి గొలిపేలా ఇందులో కనిపిస్తుంది. ఇలా ఎన్నెన్నో… మళ్ళీ ఒక్కో ఎపిసోడ్ చూడాలన్న ఉత్సాహం కలిగించేలా ఈ స్పెషల్ ఎపిసోడ్ ను తీర్చిదిద్దారు.
ఆహా అనిపించేలా అన్ స్టాపబుల్ యన్బీకే ఫస్ట్ సీజన్ సాగుతోంది. నటప్రపూర్ణ మోహన్ బాబు అతిథిగా మొదలైన ఈ టాక్ షో నటశేఖరుని వారసుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తొలి అంకం పూర్తి కానుంది. బాలకృష్ణ, మహేశ్ బాబు ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 4న మహేశ్ బాబుతో బాలయ్య బాబు ముచ్చట్లు ప్రసారం కానున్నాయి. తొలి సంచికలోని చివరి మజిలిగా రానున్న బాలయ్యతో మహేశ్ బాబు ఎపిసోడ్ కు ఈ తాజా స్పెషల్ ఎపిసోడ్ మరింత ఉత్సాహం కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే బాలయ్య, మహేశ్ ఎపిసోడ్ కు సంబంధించిన టీజర్ రికార్డ్స్ సృష్టించింది. ఈ స్పెషల్ ఎపిసోడ్ తో రాబోయే పదవ ఎపిసోడ్ ఏ రేంజ్ లో వ్యూవర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి. ఫిబ్రవరి 4వ తేదీ దాకా ఇంటిల్లి పాది కలసి చూసేలా రూపొందిన స్పెషల్ ఎపిసోడ్ చూస్తే ఇది నటసింహ అన్ స్టాపబుల్ వినోదాల గర్జన అనిపించక మానదు.