నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా ‘అఖండ’లో నటిస్తున్నారు. ‘సింహా, లెజెండ్’ తర్వాత రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల బాలకృష్ణ తన తదుపరి చిత్రాలపైనా క్లారిటీ ఇచ్చారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘క్రాక్’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన మలినేని గోపీచంద్ తో బాలకృష్ణ మూవీ చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా వార్త వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో మలినేని గోపీచంద్ బిజీగా ఉన్నారు.
Read Also : “బిగ్ బాస్-5” హోస్ట్ పై వీడిన సస్పెన్స్ !!
ఇక ఎంతోకాలంగా బాలకృష్ణ… అనిల్ రావిపూడితో చిత్రం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దానితో పాటు శ్రీవాస్, పూరి జగన్నాథ్, వెంకీ అట్లూరితో బాలకృష్ణ సినిమాలు ఉండబోతున్నాయన్నది కొంతకాలంగా సోషల్ మీడియాలో నలుగుతున్న వార్తే! అయితే ఆ జాబితాలోకి ఇప్పుడు వెంకీ కుడుముల సైతం చేరాడు. తొలి చిత్రం ‘ఛలో’తోనూ, మలి చిత్రం ‘భీష్మ’తోనూ కుర్రకారు మది దోచుకున్న వెంకీ కుడుముల బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథను సిద్దం చేశాడట. ఇటీవల బాలకృష్ణకు దాన్ని నెరేట్ చేశాడని, సబ్జెక్ట్ లైన్ నచ్చడంతో ఆయన ప్రొసీడ్ అంటూ భుజం తట్టాడని అంటున్నారు. విశేషం ఏమంటే… ఇటు దర్శకులే కాకుండా అటు ప్రముఖ నిర్మాణ సంస్థలు సైతం బాలకృష్ణతో సినిమా నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్నాయట. దిల్ రాజు, సి. కళ్యాణ్, రాజ్ కందుకూరితో పాటు ఏకె ఎంటర్ టైన్ మెంట్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ వంటి సంస్థలూ బాలకృష్ణతో సినిమా నిర్మాణానికి సై అంటున్నాయని తెలుస్తోంది. మరి ఏ దర్శకుడితో ఏ బ్యానర్ లో బాలకృష్ణ సినిమా చేస్తాడనేది తెలియాలంటే కొంతకాలం ఓపిక పట్టాల్సిందే!