యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఎఫ్2’ సీక్వెల్ ‘ఎఫ్3’ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ లవర్స్. అయితే ఈసారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ టీం డబ్బు సంపాదన టాపిక్ తో ప్రేక్షకులను అలరించబోతున్నట్టు పోస్టర్స్ ద్వారా చెప్పేశాడు అనిల్ రావిపూడి. ‘ఎఫ్2’లో ఉన్న ప్రధాన తారాగణం వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ సీక్వెల్ లో కూడా కొనసాగుతున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల్లో హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ప్రారంభమవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ లో రాజేంద్ర ప్రసాద్ రోల్ ను ఓ ఎవర్ గ్రీన్ పాత్రలా తీర్చిదిద్దుతున్నాడట అనిల్. 1987లో విడుదలైన “అహ నా పెళ్లంట” చిత్రంలో ప్రముఖ సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు పాత్రను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. ఆ సినిమా విడుదలై కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ జనాలు ఆయన పాత్రను ఇప్పటికి ఎంజాయ్ చేస్తారు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ఎఫ్ 3’ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌ను కూడా దాదాపు అలాంటి పాత్రలోనే చూపించబోతున్నాడట అనిల్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.