టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవలే కోవిడ్ -19 బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్-3’ నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సిన ముందురోజే ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు కోవిడ్ -19కు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు కరోనా సోకిన తర్వాత ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా వివరిస్తున్నాడు. కాగా గత రెండు వారాల్లో యువ దర్శకుడి వివిధ ప్రాజెక్టుల గురించి అనేక పుకార్లు వచ్చాయి. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పుకార్లన్నీ నిజమని స్వయంగా అనిల్ రావిపూడి ధృవీకరించడం విశేషం. తాజాగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ఎఫ్-3 షూటింగ్ 50 శాతం పూర్తయింది. షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి మేము తొందరపడటం లేదు. పరిస్థితులు సురక్షితమైనప్పుడే మేము షూటింగ్ ప్రారంభిస్తాము. కరోనా మహమ్మారి తర్వాత ఈ సినిమా ప్రజలకు సరైన లాఫ్టర్ థెరపీ అవుతుంది” అని ఆయన అన్నారు. ఇంకా అనిల్ రావిపూడి మాట్లాడుతూ “బాలయ్య బాబు స్క్రిప్ట్ పూర్తయింది. కానీ అది మల్టీస్టారర్ కాదు. ఇది వేరే జానర్ మూవీ. మహేష్ బాబు స్క్రిప్ట్ కూడా ఒకే అయ్యింది. త్రివిక్రమ్ చిత్రం తరువాత మహేష్ తో సినిమా ఉండే అవకాశం ఉంది. ‘రాజా ది గ్రేట్’ సెకండ్ పార్ట్ రెడీ అవుతోంది. ఎఫ్ 3 తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఒక నెలలో వెల్లడిస్తాను” అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.