ప్రస్తుతానికి రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని వెంకట సతీష్ కిలారు ‘వృద్ధి సినిమా’ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారని రకరకాల చర్చలు జరిగాయి. దాదాపుగా అరడజన్ మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి, వెళ్లాయి.
Also Read:Peddi: తిండి తిప్పలు మానేసిన బుచ్చిబాబు?
అయితే రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారనే విషయం మీద తాజాగా క్లారిటీ ఇచ్చేశారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్. వారు నిర్మించిన ‘డ్యూడ్’ సినిమా హిట్ అయిన నేపథ్యంలో ఒక సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటిస్తున్న క్రమంలో, రామ్ చరణ్ తదుపరి చిత్రం గురించి చర్చ వచ్చింది. దీంతో ఏమాత్రం తడుముకోకుండా నవీన్ మాట్లాడుతూ, రామ్ చరణ్ తేజ ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత సుకుమార్ గారితో సినిమా చేస్తారని చెప్పుకొచ్చారు. సుకుమార్ తదుపరి చిత్రం ‘పుష్ప 3’ కాదని, రామ్ చరణ్తో చేయబోతున్న సినిమానేనని ఆయన క్లారిటీ చేశారు. దీంతో రామ్ చరణ్ తదుపరి చిత్రం ఏమిటి అనే విషయం మీద గత కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చలకు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ బ్రేకులు వేసినట్లయింది.