బిగ్ బాస్ సీజన్ 6 లో రెండోవారం నాగార్జున ముందుగా చెప్పినట్టే ఇద్దరిని హౌస్ నుండి ఇంటికి పంపేశాడు. శనివారం షానీకి వీడ్కోలు పలకడం చిత్రంగా జరిగింది. అతని నుండి ఎలాంటి ఫీడ్ బ్యాక్ తీసుకోకుండా, హౌస్ లోని వారిపై అతని అభిప్రాయం తెలుసుకోకుండా బయటకు పంపేశాడు. బట్… ఆదివారం ఎపిసోడ్ లో అభినయశ్రీ కి సాదర వీడ్కోలు దక్కింది. మూడు విడతలుగా జరిగిన సేఫ్, అన్ సేఫ్ రౌండ్స్ లో మొదట గీతూ, రాజశేఖర్ సేఫ్ అయిపోయారు. ఆ తర్వాత రౌండ్ లో ఫైమా, రేవంత్ సేఫ్ అయ్యారు. మూడో రౌండ్ లో మరీనా- రోహిత్ సేఫ్ అయ్యారు. ఇక లాస్ట్ రౌండ్ సమయానికి అభినయశ్రీ, ఆదిరెడ్డి ఉండగా వారిలోంచి అభినయశ్రీ ఎలిమినేట్ అయిపోయింది. అయితే… అభినయశ్రీ తాను బయటకు కనిపించేంత బేల మహిళను కాదని నిరూపించుకుంది. నిజానికి బిగ్ బాస్ కు ఎంపిక కావడం తనకు దొరికిన బెస్ట్ ఛాన్స్ అనే అభిప్రాయంతో అభినయశ్రీ ఉంది. మరో రెండు మూడు వారాలు హౌస్ లో ఉండగలనని నమ్మింది. తన ఆటను ఆమె ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న సమయంలో ఎలిమినేట్ కావడం ఓ రకంగా అశనిపాతమే. కానీ దానిని కూడా అభినయశ్రీ తేలికగా తీసుకుంది. తనను హగ్ చేసి కన్నీళ్ళు పెట్టుకున్న వారిని ఓదార్చింది. ‘ఇలా ఏడవడం తనకు ఇష్టం ఉండద’ని అంటూ, ‘నేను పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్ళడం లేదు… ఇంటికే వెళుతున్నాను’ అంటూ ఫైమా వంటి వారిని ఓదార్చింది. పెళ్ళిలో అప్పగింతలు అవ్వగానే వధువు తాలుకు బంధువులు కన్నీరుమున్నీరు కావడం మనం చూస్తూనే ఉంటాం! దానినే అభినయశ్రీ ఉదాహరణగా పేర్కొంది!!
అభినయశ్రీ టార్గెట్ రేవంత్!
బిగ్ బాస్ హౌస్ నుండి నేరుగా స్టేజ్ మీదకు వచ్చిన అభినయశ్రీ ని సెండాఫ్ సమయంలో హౌస్ లోని వారిలో హానెస్ట్, డిజానెస్ట్ పర్సన్స్ ను తెలుపమని నాగార్జున కోరాడు. ఒక్కో కేటగిరికి ఐదుగురిని చెప్పమన్నాడు. ఫైమా, చంటి, శ్రీసత్య, బాలదిత్య, ఆర్జే సూర్య హానెస్ట్ గా ఉన్నారని, ఒక్క రేవంత్ మాత్రం తనకు డిజానెస్ట్ గా కనిపించాడని అభినయశ్రీ చెప్పింది. హానెస్ట్ కు ఐదుగురిని ఎంపిక చేసిన అభినయశ్రీ, డిజానెస్ట్ కేటగిరికి వచ్చేసరికీ కేవలం రేవంత్ పేరు మాత్రమే పేర్కొంది. గీతూ అంటే తనకు ఇష్టమని, ఆమె టాప్ త్రీ లో ఉండాలని కోరుకుంది. అలానే బాలాదిత్య టాప్ 5లో చోటు దక్కించుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసింది. మొత్తానికి ‘అ అంటే అమలాపురం’ అంటూ థియేటర్లలో ఆడియెన్స్ ను అల్లల్లాడించిన అభినయశ్రీ బిగ్ బాస్ హౌస్ లో పేలవమైన ఆటతీరుతో వ్యూవర్స్ ను మెప్పించలేకపోయింది. రెండు వారాలకే షో నుండి ఎలిమినేట్ అయిపోయింది.