తెలుగువారి మదిలో చెరిగిపోని, తరిగిపోని స్థానం సంపాదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 99వ జయంతి మే 28న. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ఆయన నటవారసుడు నందమూరి బాలకృష్ణ తన గానంతో ఓ నివాళి సమర్పిస్తున్నారు. శ్రీరాముని పాత్రలో యన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది. “సంపూర్ణ రామాయణం, లవకుశ, శ్రీకృష్ణసత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామపట్టాభిషేకం” చిత్రాలలోనూ “చరణదాసి, సి.ఐ.డి. చిట్టిచెల్లెలు, అడవిరాముడు” వంటి సాంఘికాలలోనూ శ్రీరాముని పాత్రలో కనిపించి అలరించారు యన్టీఆర్. తెలుగువారి మదిలోనే కాదు, యావత్ దక్షిణాదిన, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ రాముడు అంటే రామారావే అన్న రీతిలో ఆకట్టుకున్నారాయన. శ్రీరామునిగా రామారావు నటించిన పౌరాణికాలు హిందీ, బెంగాలీ, ఒరియా భాషల్లోకి అనువాదమై అక్కడి వారినీ మురిపించాయి. ఈ నేపథ్యంలో యన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా బాలకృష్ణ తండ్రికి నివాళిగా తన గానంతో ‘శ్రీరామదండకం’ విడుదల చేయనున్నారు.
యన్టీఆర్ జయంతి అయిన మే 28న ఉదయం 9.30 గంటల తరువాత బాలకృష్ణ గానం చేసిన ‘శ్రీరామదండకం’ విడుదల కానుంది. యన్టీఆర్ పోషించిన శ్రీరాముని పాత్రల బొమ్మలపై బాలయ్య గానం చేసిన ‘శ్రీరామదండకం’ గద్యం పోస్ట్ చేసి వీడియోను విడుదల చేయనున్నారు. శ్రీరామపాత్రలో అనితరసాధ్యంగా అభినయించిన రామారావు బొమ్మలు, వాటిపై బాలయ్య గానం చేసిన ‘శ్రీరామదండకం’ గద్యం నందమూరి అభిమానులకు ఆనందం పంచుతుందని ఆశించవచ్చు.