కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయి ఉంటే… ఈజూలై 30వ తేదీ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలై సందడి చేసి ఉండేది. కానీ అనుకున్నామని జరగవు అన్నీ అన్నట్టుగా… కరోనా సెకండ్ వేవ్ తో అందరి అంచనాలు తల్లకిందులై పోయాయి. అయితే అదృష్టం ఏమంటే… మూడు నెలలుగా మూతపడిన థియేటర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. గత శుక్రవారం (23వ తేదీ) తమిళ డబ్బింగ్ సినిమా ‘నేరగాడు’ విడుదల కాగా… ఈ శుక్రవారం (30వ తేదీ) ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
పది రోజుల క్రితం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను కలిసి, తమ సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు ఎగ్జిబిటర్స్, థియేటర్ల యాజమాన్యం. దాంతో సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వెంటనే థియేటర్లు తెరుస్తామని యాజమాన్యం తలసానికి మాట ఇచ్చింది. కానీ తగినన్ని సినిమాలు విడుదలకు లేకపోవడంతో థియేటర్లను తెరవలేదు. కానీ ఈ శుక్రవారం సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’, తేజ సజ్జా ‘ఇష్క్’, నందగోపాల్ నటించిన ‘నరసింహాపురం’తో పాటు ‘త్రయం’, ‘పరిగెత్తు పరిగెత్తు’ సినిమాలు సైతం విడుదల కాబోతున్నాయి. దీంతో తెలంగాణలో థియేటర్లు ఒక మోస్తరుగా అయినా కళకళలాడటం జరుగుతుంది.
Read Also : “ఆదిపురుష్” హీరోయిన్ సినిమా లీక్
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. అక్కడ రోజుకు మూడు ఆటల ప్రదర్శనకే అనుమతి ఉంది. అలానే టిక్కెట్ రేట్ల పెంపు, కరెంట్ బిల్లుల విషయంలో పంచాయితీ ఇంకా తెగలేదు. జగన్ ప్రభుత్వం సైతం ఆ విషయంపై దృష్టి పెట్టకపోవడంతో కినుక వహించిన థియేటర్ల యాజమాన్యం వాటిని తెరవడానికి ఆసక్తి చూపడంలేదు. ‘తిమ్మరుసు, ఇష్క్’ చిత్రాలకు ఓ మోస్తరు క్రేజ్ ఉన్నా… అక్కడ థియేటర్లు తెరవకపోతే… నిర్మాతలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మరి ఈ మూడు రోజుల్లో ప్రభుత్వంతో ఏమైనా చర్యలు జరిపి, థియేటర్లను తెరుస్తారేమో చూడాలి. అలానే యాభై శాతం ఆక్యుపెన్సీని శుక్రవారం నుండి నూరుశాతం చేస్తేనే ఇటు ఎగ్జిబిటర్ కు, అటు నిర్మాతకు మేలు జరుగుతుంది.
ఈ అంశాలలో క్లారిటీ వస్తే… ఆగస్ట్ మొదటివారంలో విడుదలయ్యే సినిమాల సంఖ్య కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఇప్పటికే ‘ఎస్. ఆర్. కళ్యాణమండపం’, ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ వంటి మూడు నాలుగు సినిమాలు ఆగస్ట్ 6న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణలోని ఎగ్జిబిటర్స్ ఒక త్రాటి పైకి వచ్చి థియేటర్లు తెరిస్తే… పెద్ద నిర్మాతలు సైతం తమ చిత్రాల విడుదలకు క్యూ కడతారనడంలో సందేహం లేదు.