అక్టోబర్ 5వ తేదీన మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ గా రాబోతున్నారు. మలయాళ హిట్ ‘లూసిఫర్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథిగా కనిపించనున్నాడు. ఇప్పటికే వీరిద్దరిపై చిత్రీకరించిన పాట విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ, సముతిరఖని, తాన్యా రవిచంద్రన్, పూరి జగన్నాథ్ ఇతర పాత్రలు పోషిస్తుండగా థమన్ సంగీతం అందించాడు. ఇక అదే తేదీన నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ కూడా విడుదల కానుంది.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిచంచిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనికా సురేంద్రన్, రవివర్మ, జయప్రకాశ్ ఇతర పాత్రధారులు. సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నందున పంపిణీదారులు, ప్రదర్శనదారులు ‘గాడ్ ఫాదర్’ను హిందీలో కూడా విడుదల చేయాలని చిరును కోరారట. అయితే చిరంజీవి అంగీకరించలేదట. తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించిన తర్వాత ఆలోచిద్దామని చెప్పినట్లు వినికిడి. అయితే నాగార్జున ‘ద ఘోస్ట్’లో యాక్షన్ కంటెంట్ బాగా ఉండటంతో ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గోల్డ్ మైన్స్ ఫిల్మ్స్ హిందీ విడుదల కోసం సంప్రదించగా నాగ్ ఓకె చెప్పారట. ‘పుష్ప’ హిందీ వెర్షన్ పంపిణీదారులు ‘ది ఘోస్ట్’ని బాలీవుడ్‌లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇటీవల విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’తో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నాగార్జున. మరి నో చెప్పిన చిరుకు జరిగే నష్టం ఏమిటి? ఓకె చెప్పిన నాగార్జునకు ఒనకూరేదేమిటన్నది ఆక్టోబర్ 5న కానీ తేలదు. అప్పటివరకూ ఏం జరుగుతుందో చూద్దాం.