Chiranjeevi Shocking Comments On Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పటివరకూ ఒక్క ఓటమి కూడా ఎరుగని దర్శకుడు. బాహుబలి తెలుగు చిత్రసీమ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన ఈయన.. ఆర్ఆర్ఆర్‌తో విదేశీ గడ్డలపై తన సత్తా చాటాడు. మనకన్నా విదేశీయులే ఈ సినిమా ఆస్కార్ పురస్కారాలు సాధించాలని బలంగా కోరుకుంటున్నారంటే, ఏ రేంజ్‌లో ఆ సినిమా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. దటీజ్ జక్కన్న. అలాంటి దర్శకుడితో సినిమా చేయాలని ఎవరు కోరుకోరు చెప్పండి? ఎందరో స్టార్ హీరోలు ఆయనతో కలిసి పని చేయాలని ఉబలాటపడుతున్నారు. అంతెందుకు, ఒక చిన్న పాత్ర పోషించే ఛాన్స్ ఇచ్చినా చాలని కోరుకునే వారు కోకొల్లలు. కానీ, తనకు మాత్రం రాజమౌళి డైరెక్షన్‌లో నటించాలన్న ఆశ లేదని మెగాస్టార్ చిరంజీవి బాంబ్ పేల్చారు.
‘‘రాజమౌళి ఒక గొప్ప దర్శకుడు. ఆయన భారత సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రతీ విషయాన్ని ఆయన ఎంతో లోతుగా చూస్తారు. ఒక నటుడిగా ఆయన కోరుకునే ఔట్‌పుట్‌ని నేను ఇవ్వగలనో లేదో తెలియదు. ఇక జక్కన్న ఒక్కో సినిమాకి ఎంత సమయం తీసుకుంటాడో అందరికీ తెలుసు. మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం కచ్ఛితంగా తీసుకుంటాడు. కానీ నేను ఒకేసారి మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తున్నా. అందుకే, ఆయనతో పని చేయాలని గానీ, పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆశ గానీ లేదు’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. తన ‘గాడ్‌ఫాదర్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా.. ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు ఈ విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి, దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి.
కాగా.. ‘గాడ్‌ఫాదర్’ సినిమా మలయాళంలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘లూసిఫర్’కి రీమేక్. ఇందులో మోహన్‌లాల్ పాత్రలో చిరంజీవి నటించగా.. వివేక్ ఓబెరాయ్ పాత్రని సత్యదేవ్ పోషించాడు. ఇక అందులో అత్యంత కీలకమైన పృథ్విరాజ్ రోల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించగా.. నయనతార ఓ ప్రధాన పాత్రలో నటించింది. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకుడు. అక్టోబర్ 5వ తేదీన ఈ చిత్రం భారీఎత్తున విడుదల కాబోతోంది.