తెలుగు చిత్రసీమలో భీష్మాచార్యుడు అని పేరున్న నిర్మాత డి.వి.ఎస్.రాజు. ఆయన నిర్మాణ సంస్థ ‘డి.వి.ఎస్.ప్రొడక్షన్స్’కు జనాల్లో మంచి ఆదరణ ఉండేది. ఆ సంస్థ నిర్మించిన అనేక చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘చాణక్య శపథం’. విజయశాంతి నాయికగా నటించిన ఈ చిత్రం 1986 డిసెంబర్ 18న విడుదలయింది.
‘చాణక్య శపథం’ కథ విషయానికి వస్తే – కస్టమ్స్ ఆఫీసర్ చాణక్య నీతికి, నిజాయితీకి విలువనిచ్చే మనిషి. అతని తండ్రి మిలిటరీ మేజర్. పేరు నాగార్జున. ఆయన నుండే చాణక్యకు క్రమశిక్షణ, దేశభక్తి అలవడి ఉంటాయి. మేజర్ చేసిన సేవలకు గాను, ఆయన పేరును పద్మశ్రీ పురస్కారానికి సిఫారసు చేసి ఉంటారు. ఇదే సమయంలో రాణా అనే స్మగ్లర్ గ్యాంగ్ ను చాణక్య పట్టుకుంటాడు. అయితే పగబట్టిన రానా, చాణక్య తండ్రి మేజర్ కే స్మగ్లర్స్ తో అనుబంధం ఉన్నట్టు దొంగ సాక్ష్యాలతో నిరూపిస్తారు. తనపై కక్ష సాధించడానికి తండ్రిని టార్గెట్ చేశారని తెలుసుకున్న చాణక్య శపథం చేస్తాడు. తన తండ్రిపై పడ్డ మచ్చను చెరిపేసి అసలైన నేరస్థులను చట్టానికి పట్టిస్తానంటారు. ఇక చాణక్యకు శశిరేఖ స్నేహితురాలు. ఆమె ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె అక్కను వాళ్ళ అత్త కట్నం కోసం వేధిస్తూ ఉంటుంది. ఆ సమస్య నుండి అక్కను రక్షించాలన్నది శశిరేఖ ప్రయత్నం. చాణక్య, శశిరేఖ ఇద్దరూ తమ సమస్యల నుండి బయట పడడానికి ఒకరికొకరు సహకరించుకుంటారు. చివరకు నేరస్థులను చట్టానికి పట్టించడంతో కథ ముగుస్తుంది. మేజర్ ను అందరూ గౌరవిస్తారు.
ఇందులో చాణక్యగా చిరంజీవి, శశిరేఖగా విజయశాంతి నటించిన ఈ చిత్రంలో రాణాగా రావు గోపాలరావు నటించారు. సత్యనారాయణ, అన్నపూర్ణ, సూర్యకాంతం, వై.విజయ, రాజ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, సుధాకర్, సుత్తివేలు, కాంతారావు, రంగనాథ్, చలపతిరావు, ఈశ్వరరావు, బాబ్ క్రిష్టో ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి రచన పరుచూరి బ్రదర్స్, వేటూరి పాటలు, చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఇందులోని “మెల్లగా అల్లుకో…”, “వరె వరె వరిచేలో…”, “షోకు తోటలో…”, “వేడి వేడి వలపులు…, “నీ బండ బడ…” సాంగ్స్ అలరించాయి. రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబినేషన్, అందునా విజయశాంతి హీరోయిన్ అనగానే ఈ సినిమాకు మంచి క్రేజ్ లభించింది. మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అభిమానులను అలరించింది.