స్టార్ హీరోయిన్ సాయి పల్లవి పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ భజరంగ్ దళ్ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సాయి పల్లవి విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది. రానా దగ్గుబాటి హీరోగా నటించిన ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. పలు వాయిదాల తరువాత ఈ సినిమా జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సాయి పల్లవి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
“ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అని చెప్పలేం.. కొన్ని రోజుల ముందు కూడా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా వచ్చింది కదా? .. ఆ టైమ్ లో ఉన్న కాశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు కదా?.. మనం మత ఘర్షణలా వాటిని చూస్తే.. రీసెంట్ గా ఓ బండిలో ఎవరో ఆవులని తీసుకెళ్తున్నారు. ఆ బండిని నడుపుతున్న వ్యక్తి ముస్లీంగా ఉన్నారు. వాటిని చూసి కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగినదానికి తేడా ఎక్కడ వుంది.. మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా వుంటే ఇతరులను బాధించం.. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం మంచిగా వుండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు” అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి.
ఇక దీంతో భజరంగ్ దళ్ నాయకులు ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా తో పాటు.. గో రక్షకులపై సాయి పల్లవి వివాదాస్పద వాఖ్యలు చేసిందని, గోరక్షకులను కాశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి పల్లవి తన మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణలు కోరాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో పరిశీలించి, లీగల్ ఒపీనియన్ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.