Case Filed on Tollywood Producer in Radisson Drugs Case: ఎక్కడ ఏ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు అయినా ఎక్కడో ఒక చోట టాలీవుడ్ లింక్ కలకలం రేపుతోంది. తాజాగా గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులందరూ రాడిసన్ హోటల్‌లో ఘనంగా పార్టీ చేసుకున్నారని వీరిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడు, వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారని తేల్చారు. పక్కా సమాచారంతో పోలీసులు రాడిసన్ హోటల్‌పై దాడి చేయగా అక్కడ యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. ఇక రాడిసన్ డ్రగ్ పార్టీ ఎఫ్ఆర్ లో కీలక విషయాలను పోలీసులు పొందుపరిచారు. ఇక ఈ కేసులో ఇద్దరు అమ్మాయితో పాటు తొమ్మిది మందిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్.. అబ్బాస్ లపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రగ్స్ సేవించిన నిర్భయతో పాటు రఘు చరణ్ మీద కేసు నమోదు చేశారు. ఇక ఇదే కేసులో ఒక టాలీవుడ్ నిర్మాత పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన నిర్మాతగా ఇంకా సినిమాలు మొదలు పెట్టలేదు. 2020లో ఒక స్టార్ హీరో మరో స్టార్ డైరెక్టర్ కాంబోలో ఒక సినిమాను అనౌన్స్ చేశారు. అది ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఇక ఆయన మరో స్టార్ హీరోకి వ్యాపార భాగస్వామి అని కూడా చర్చ జరుగుతోంది. ఇక మరో వ్యాపారవేత్త సందీప్ మీద కేసు నమోదు చేశారు. శ్వేత అనే సెలబ్రిటీతో పాటు లిశిపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో నీల్ అనే వ్యక్తితో పాటు ఖుషి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక పది మంది కలిసి డ్రగ్ తీసుకున్నట్లుగా గుర్తించారు. బయట నుండి అబ్బాస్ డ్రగ్స్ తెచ్చాడని, కొకైన్ పేపర్ రోల్ లో చుట్టి తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు.