Puri Jagannadh: విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఏ ముహూర్తాన ఈ సినిమాను రిలీజ్ చేశారో కానీ రిలీజ్ అయ్యినప్పటినుంచి ఈ సినిమాకు సంబందించిన వివాదాలు పూరి తలకు చుట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో రాజకీయ నేతలు పెట్టుబడి పెట్టినట్లు గతంలో పుకార్లు షికార్లు చేశాయి. అప్పుడు పూరి కానీ,నిర్మాత ఛార్మీ కానీ నోరువిప్పింది లేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ వివాదంపై క్లారిటీ ఇవ్వడానికి ఈ జంట ఈడీ ఆఫీస్ కు వెళ్లారు.
లైగర్ సినిమాలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టినట్లు అనుమానం రావడంతో డైరెక్టర్ పూరికి, నిర్మాత ఛార్మీకి ఈడీ 15 రోజులక్రితమే నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడిన పూరి తాజాగా ఛార్మీతో కలిసి దొడ్డిదారిన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఇక ఈ జంటను ఉదయం నుంచి ఈడీ ప్రశ్నిస్తోంది.విదేశీ పెట్టుబడులపై వీరిని ఈడీ ప్రశ్నిస్తుందని సమాచారం. ఇక పూరి ఈ వివాదంలో ఎవరెవరిని బయటకు లాగుతాడు అనేది తెలియాల్సి ఉంది.