టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఎవరు అంటే అందరి నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ప్రభాస్’. రీజనల్ సినిమాలు చేస్తూ తెలుగులో స్టార్ హీరో అయిన ప్రభాస్, ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రభాస్ ఎవరితో సినిమా చేసినా, ప్రభాస్ సినిమాలో ఎవరు హీరోయిన్ గా నటించినా… పెళ్లి అనే సరికి ప్రభాస్ పక్కన ఆయన అభిమానులకి అనుష్క మాత్రమే కనిపిస్తుంది. మంచి ఫ్రెండ్స్ అయిన ప్రభాస్ అనుష్కలు ప్రేమలో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే మాట కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉంది. ఈ రూమర్ బయటకి వచ్చిన మొదట్లో అదేమీ లేదని ప్రభాస్ అనుష్కలు కొట్టి పడేశారు కానీ ఆ తర్వాత పెద్దగా స్పందించడం మానేశారు. ఆ మధ్యలో ప్రభాస్ ఇంకో అమ్మాయిని అరేంజ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త తెగ వైరల్ అయ్యింది. ఆ అమ్మాయి ఫోటో కూడా నెట్ లో పెట్టి, ఈ అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అంటూ హల్చల్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్ కృతి సనన్ లవ్ లో ఉన్నారు అనే వార్త టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వినిపిస్తోంది.
ప్రభాస్ కృతి సనన్ కలిసి ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ప్రభాస్ కృతి ప్రేమలో పడ్డారు. షూటింగ్ ఉన్నా లేకున్నా ప్రభాస్ ముంబై వెళ్లి మరీ కృతిని కలుస్తున్నాడు అంటూ బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో కూడా ప్రభాస్ కృతి చాలా క్లోజ్ గా కనిపించడంతో ఈ ప్రేమ వ్యవహారం నిజమయ్యి ఉంటుందని అంతా నమ్మారు. తాము రిలేషన్ లో ఉన్నామని ప్రభాస్ కృతి సనన్ ఎప్పుడు చెప్తారా? అని ప్రభాస్ ఫాన్స్ ఎదురు చూస్తుంటే, ఈ ఇద్దరి ప్రేమ విషయాన్ని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ బయట పెట్టడం విశేషం. ‘తోడేలు’ ప్రమోషన్స్ లో భాగంగా ఒక షోకి వెళ్లిన వరుణ్ ధావన్, కరణ్ జోహార్ తో మాట్లాడుతూ… “కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు. అతను ఇప్పుడు ముంబైలో లేడు కానీ దీపికా పడుకోణెతో షూటింగ్ లో ఉన్నాడు” అంటూ హింట్ ఇచ్చాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న కృతి సనన్ సిగ్గు పడుతూ నవ్వేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుణ్ ధావన్ చెప్పిన మాట నిజమే… ప్రభాస్ ప్రస్తుతం ముంబైలో లేడు హైదరాబాద్ లో దీపికతో ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో ఉన్నాడు, ప్రభాస్ కృతిలు లవ్ లో ఉన్నారు అంటూ రెబల్ స్టార్ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, దీపికా పడుకోణె ముంబైలో లేదు అన్న మాట వాస్తవమే కానీ ఆమె హైదరాబాద్ లో కాకుండా అస్సాంలో ఉంది. అక్కడ వారం రోజులుగా హృతిక్ రోషన్ నటిస్తున్న యాక్షన్ మూవీ ‘ఫైటర్’ సినిమా షూటింగ్ లో ఉంది. మరి వరుణ్ ధావన్ చెప్పింది, హృతిక్ రోషన్ గురించా? లేక ప్రభాస్ గురించా అంటూ కొందరు అయోమయంలో పడ్డారు. అయితే ‘సుజానే’తో విడాకులు తీసుకున్న తర్వాత హృతిక్ రోషన్, ‘సబా ఆజాద్’తో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.