BN Reddy: తెలుగునాట ‘బ్రదర్’ అన్న పిలుపు వినగానే, మనకు నటరత్న ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. ‘బ్రదర్’ అన్న మాటను ఎన్టీఆర్, ఏఎన్నార్ పరస్పరం పిలుచుకోవడం ద్వారా తెలుగు చిత్రసీమలో పాపులర్ చేశారని చెప్పక తప్పదు. అయితే, ఆ మాట వినగానే ముందుగా ఎన్టీఆర్ గుర్తుకు రావడానికి కారణం, ఆయన తనకు పరిచయమైన వారిలో తొంభై శాతం మందిని ‘బ్రదర్’ అంటూనే సంబోధించేవారు. అందువల్ల ‘బ్రదర్’ అనగానే అన్న ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. అయితే ఆ మాటను ఎన్టీఆర్ బలంగా పట్టుకొనేలా చేసింది మాత్రం ప్రఖ్యాత దర్శకులు బీఎన్. రెడ్డి అనే చెప్పాలి.
Read Also: త్రివిక్రమ్ నేర్పిన జీవిత సత్యాలు.. ప్రతి ఒక్కరు పాటించాల్సినవే !
ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే ముందు చిత్రసీమలో ‘బ్రదర్’ అనే మాటను బీఎన్.రెడ్డి బాగా ఉపయోగించారు. బీఎన్.రెడ్డి తన కంటే వయసులో పెద్దవారయిన మరో ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మంను ‘బ్రదర్’ అంటూ సంబోధించేవారు. అలాగే రామబ్రహ్మం కూడా అదే తీరున స్పందించేవారు. చిత్రసీమలో యన్టీఆర్ తన గురువులుగా కేవీ రెడ్డి, బీఎన్.రెడ్డి, యల్వీ ప్రసాద్ ను భావించేవారు. బీఎన్. రెడ్డి డైరెక్షన్ లో యన్టీఆర్ నటించిన తొలి చిత్రం ‘మల్లీశ్వరి’. ఆ సినిమా తెలుగు చిత్రసీమలో ఓ కళాఖండంగా ఈ నాటికీ జేజేలు అందుకుంటోంది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే బీఎన్.రెడ్డి పలువురిని ‘బ్రదర్’ అంటూ సంబోధించడమూ, తాను అన్నగా భావించే గూడవల్లి రామబ్రహ్మం గురించి ముచ్చటించడమూ జరిగింది. ఆ సంప్రదాయం ఎందుకనో ఎన్టీఆర్ మనసును తాకింది. అప్పటి నుంచీ యన్టీఆర్ సైతం తనకంటే సీనియర్లను గౌరవించడం, ఇతరులను ‘బ్రదర్’ అని పిలవడం ఆరంభించారు. ఆ మాటను ఆయన తెలుగునాట భలేగా పాపులర్ చేశారు. అందుకే ఈ నాటికీ ఎవరైనా ‘బ్రదర్’ అని పిలవగానే టాలీవుడ్ లో నటరత్నను గుర్తు చేసుకుంటారు.
(నవంబర్ 8న బీఎన్ రెడ్డి వర్ధంతి)