ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు సముతిరకని. తమిళనాట నటదర్శకునిగా సాగుతున్న సముతిరకని అనేక తెలుగు చిత్రాలలో తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఆయన తమిళంలో రూపొందించిన కొన్ని సినిమాలు తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. దర్శకునిగానూ తెలుగులో కొన్నిచిత్రాలు తెరకెక్కించారు. ఇక ‘అల…వైకుంఠపురములో’, ‘ట్రిపుల్ ఆర్’ సినిమాలతో సముతిరకని నటునిగానూ తెలుగువారికి దగ్గరయ్యారు . సముతిరకని దర్శకత్వంలో రూపొందిన ‘వినోదయ సిథమ్’ చిత్రం తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కనుంది.
సముతిరకని 1973 ఏప్రిల్ 26న తమిళనాట జన్మించారు. సొంతవూరు రాజపాలయంలో బి.యస్సీ, చదివిన సముతిరకని, మద్రాస్ లోని అంబేద్కర్ లా కాలేజ్ లో లా చేశారు. నటుడు కావాలని అప్పటి నుంచే తపించేవారు. తమిళ దర్శకుడు కె.విజయన్ దగ్గర అసిస్టెంట్ గా చేరారు సముతిరకని. తరువాత కె.బాలచందర్ నూరవ చిత్రం ‘పార్తలే పరవశమ్’ చిత్రానికీ అసోసియేట్ గా పనిచేశారు సముతిరకని. బాలచందర్
రూపొందించిన మెగా సీరియల్ ‘అన్ని’కి కూడా పనిచేశారాయన. చిత్రసీమలో పలు పాట్లు పడ్డ తరువాత తాను కోరుకున్న విధంగా ‘ఉన్నై చరనదైందేన్’చిత్రంతో దర్శకుడయ్యారు సముతిరకని. ఈ చిత్రాన్ని మన గానగంధర్వుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్.పి.చరణ్ నటించి, నిర్మించడం విశేషం! తరువాత విజయ్ కాంత్ హీరోగా ‘నెరంజ మనసు’ చిత్రానికి దర్శకత్వం వహించారు సముతిరకని. తెలుగులో పృథ్వీరాజ్ హీరోగా ‘నాలో’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఆపై రవితేజ హీరోగా ‘శంభో శివ శంభో’ చిత్రాన్నీ తెలుగులో తెరకెక్కించారు. నాని హీరోగా ‘జెండాపై కపిరాజు’ సినిమాను కూడా సముతిరకనియే రూపొందించారు. అల్లరి నరేశ్ తో ‘సంఘర్షణ’ అనే చిత్రాన్నీ తీశారాయన. దర్శకునిగా నాలుగు తెలుగు సినిమాలు రూపొందించినా, లభించని గుర్తింపు నటునిగా ఇట్టే సంపాదించేశారు సముతిరకని. ఆయన నటించిన అనేక అనువాద చిత్రాల్లోనూ నటనతో ఆకట్టుకున్నారు. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి తపిస్తారు. అదే రీతిన వైవిధ్యమైన అంశాలు తట్టినప్పుడే కథలు రాసి, సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటారు. తెరపై విలక్షణమైన పాత్రల్లో కనిపించే సముతిరకని, దర్శకునిగా వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ ఉంటారు. అదే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. తన ‘వినోదయ సిథమ్’తో తమిళ జనాన్ని విశేషంగా ఆకట్టుకున్న సముతిరకని తెలుగులో పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించే ఆ సినిమాతో ఏ రీతిన అలరిస్తారో చూడాలి.