Bigg Boss Jessy Debuting As Hero With Error 500 Film: ప్రముఖ మోడల్, బిస్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ జస్వంత్ పడాల (జెస్సీ)ను హీరోగా పరిచయం చేస్తూ, మైత్రేయ మోషన్ పిక్చర్స్ పతాకంపై యు. బాలరెడ్డి ‘ఎర్రర్ 500’ అనే మూవీని నిర్మించారు. నక్షత్ర త్రినయని హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ద్వారా సాందీప్ మైత్రేయ ఎన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, ”ఈ మూవీ టీజర్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో యువత రావాల్సిన అవసరం వుంది. వారిని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ‘ఎర్రర్ 500’ యూనిట్ చాలా ప్యాషన్ ఈ సినిమాను చేశారు. వీరికి నా అభినందనలు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి” అని కోరారు. హీరో జస్వంత్ మాట్లాడుతూ, ”మా టీజర్ ని లాంచ్ చేసిన మంత్రివర్యులు తలసాని గారికి కృతజ్ఞతలు. వారి ప్రోత్సాహం మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. మా డెబ్యు మూవీకి ఆయన టీజర్ లాంచ్ చేయడం గొప్ప ఆశీర్వదంగా అనిపించింది. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. చాలా బాగా వచ్చింది. నన్ను హీరోగా పరిచయం చేసిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు” అని అన్నారు.
తన తొలి చిత్రం టీజర్ ను తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఆవిష్కరించడం సంతోషాన్ని కలిగించిందని దర్శకుడు సాందీప్ మైత్రేయ తెలిపాడు. త్రినాధ్ వర్మ, రాజీవ్ కనకాల, సంజయ్ స్వరూప్ , రోహిణి హట్టంగడి, మొహమ్మద్ సమద్ , ప్రమోదిని, నామిన తారా, బేబీ సియా, స్వాతి, బబ్లూ మాయ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఫణి కళ్యాణ్ సంగీతాన్ని సమకూర్చగా, శశాంక్ శ్రీరామ్, ప్రశాంత్ మన్నె సినిమాటోగ్రఫీ అందించారు. గ్యారీ బిహెచ్ దీనికి కూర్పరి.