సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో మధుసూదన రాజు, ప్రతాప్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కొండవీడు’. బిగ్ బాస్ ఫేమ్ శ్వేతావర్మతో పాటు ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ, నళినీకాంత్, నవీన్ రాజ్ ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 8న మూవీ జనం ముందుకు వస్తున్న సందర్భంగా యూనిట్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. తొలుత నిర్మాత మధుసూదనరాజు మాట్లాడుతూ, ‘మూవీ టీజర్, ట్రైలర్ ను విడుదలచేసిన హీరోలు శ్రీకాంత్, సునీల్ కు ధన్యవాదాలు తెలిపారు. సినిమా షూటింగ్ సకాలంలోనే పూర్తయినా కొవిడ్ కారణంగా అనుకున్న విధంగా విడుదల చేయలేకపోయామని, కథానుగుణంగా ఈ చిత్రాన్ని ఫారెస్ట్ లో అత్యధిక భాగం చిత్రీకరించామని చెప్పారు. మూవీ ట్రైలర్స్, లిరికల్ సాంగ్స్ కు చక్కని స్పందన లభిస్తోందని, ఈ సినిమాను చూసిన పంపిణీదారుడు రామకృష్ణ తనకు నచ్చడంతో రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారని మధుసూదన రాజు తెలిపారు. కథ నచ్చి, ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించేందుకు సహకరించిన నిర్మాత మధుసూదన రాజుకు దర్శకుడు సిద్ధార్థ్ శ్రీ కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Andala Rakshasi@10years: ‘అందాల రాక్షసి’కి ముందు హీరోయిన్… ఆ వెనుకే డైరెక్టర్!
బిగ్ బాస్ ఫేమ్ శ్వేతావర్మ మాట్లాడుతూ, ”కొవిడ్ టైమ్ లో చాలా సినిమాలు చేశాను. అందులో ఇది కూడా ఒకటి. కొవిడ్ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాలో నటించాం. నిర్మాత మధుసూదనరాజు గారు నేను బిగ్ బాస్ హౌస్ లో ఉండగా ఎంతో హెల్ప్ చేశారు. ఈ మూవీని మొదట ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇంత మంచి కంటెట్ ఉన్న సినిమాను థియేటర్ లోనే విడుదల చేస్తే బాగుంటుందని ఈనెల 8న రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. ఇలాంటి చిన్న సినిమాలు విజయవంతం అయితేనే ఎంతో మంది నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఉపాధి లభిస్తుంది” అని అన్నారు. ఫారెస్ట్ ఏరియాలో డిఫరెంట్ స్టోరీతో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో చక్కని మెసేజ్ కూడా ఉందని పంపిణీదారుడు రామకృష్ణ తెలిపారు.