ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో “భీమ్లా నాయక్” సందడి నెలకొంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే పాపులర్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో “భీమ్లా నాయక్” కన్పించడం లేదు. దీంతో పవన్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళ్తే… నైజాం ఏరియాలకు చెందిన తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు ప్రముఖ ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీ ‘బుక్ మై షో’ని నిషేధించాలని నిర్ణయించుకున్నారు. బుక్ మై షో ఎక్కువ ధరలకు టిక్కెట్లను విక్రయిస్తోందని, ఆ ఎఫెక్ట్ తో చివరికి థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉందని తెలుగు చిత్ర పరిశ్రమకు తెలిసింది.
Read Also : Samantha : ఫొటోలతో జీవిత పాఠాలు… కొత్త ఫిలాసఫీ
ఇక టిక్కెట్ ధరలు తేల్చే వరకు ఆయా థియేటర్లలోని బుకింగ్ కౌంటర్లలో మాత్రమే టిక్కెట్లను విక్రయించాలని ఎగ్జిబిటర్లను చిత్ర పరిశ్రమ కోరినట్లు సమాచారం. బుక్ మై షోలో టిక్కెట్ ధరలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులను థియేటర్లకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. “భీమ్లా నాయక్” నైజాం డిస్ట్రిబ్యూటర్ ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రేక్షకులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టికెట్ కోసం బుక్ మై షో ద్వారా వసూలు చేసే కమీషన్ దాదాపు రూ.30 అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు థియేటర్ల వద్దకు వెళ్లి, గంటల తరబడి లైన్ లో నిలబడి టికెట్లు కొనేవారి సంఖ్య బాగా తగ్గింది. అందరూ ఆన్లైన్ లోనే టికెట్లను కొనడానికి మొగ్గు చూపుతున్నారు.