పవన్ కళ్యాణ్, రానాతో రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ నుంచి ఐశ్వర్యా రాజేశ్ తప్పుకుందట. ఇందులో ఐశ్వర్య రానాకి భార్య పాత్రలో నటించవలసి ఉంది. అయితే డేట్స్ సమస్య వల్ల తప్పుకున్నట్లు ప్రచారంలో ఉన్నప్పటికీ నిజానికి పవన్ భార్య పాత్రలో నటిస్తున్న నిత్యామీనన్ తో పోలిస్తే తన పాత్ర పరిధి చాలా తక్కువగా ఉన్నందువల్లే ఐశ్వర్య డ్రాప్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. తమిళంలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్ ఇటీవల కాలంలో తెలుగులోనూ మంచి పాత్రలు పోషిస్తోంది. తాజాగా విడుదలైన ‘టక్ జగదీష్’లోనూ గుర్తుండిపోయే పాత్ర పోషించింది.
ఇదిలా ఉంటే ఐశ్వర్య స్థానంలో మలయాళ నటి సంయుక్తా మీనన్ ను ఫైనలైజ్ చేస్తున్నారట. దీనిని అధికారికంగా త్వరలోనే ప్రకటించబోతున్నారు. మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ కి అద్భుతమైన స్పందన వచ్చిన నేపథ్యంలో డేనియల్ శేఖర్ పాత్ర పోషిస్తున్న రానా టీజర్ ని విడుదల చేయటానికి సిద్ధం అవుతున్నారు దర్శకనిర్మాతలు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేతో సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.