తమిళ సినీ పరిశ్రమకు చెందిన బిహైండ్‌వుడ్స్ ప్రతి ఏడాది సినిమా అవార్డుల ఈవెంట్ ని గ్రాండ్ గా చేస్తుంది. సౌత్ లోనే అత్యంత గ్రాండ్ గా జరిగే ఈ అవార్డ్స్ ఈవెంట్ కొన్ని రోజుల క్రితం అవార్డుల కార్యక్రమం నిర్వహించగా ఇందులో “గోల్డెన్ ఐకాన్ అఫ్ ది ఇయర్”గా అల్లు అర్జున్ కి అవార్డు అందించారు. ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా బన్నీ ఈ అవార్డు అందుకున్నాడు. ఈ ఈవెంట్ లో బిహైండ్‌వుడ్స్ అల్లు అర్జున్ కి ఊహించని ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. అవార్డు అందుకున్న తర్వాత బన్నీ మాట్లాడేముందు ఓ పెద్దావిడను స్టేజి మీదకు పిలిచారు. ఆమె అల్లు అర్జున్ 3వ తరగతి చదివే రోజులలో బన్నీకి జాగ్రఫీ పాఠాలు చెప్పిన స్కూల్ టీచర్, పేరు అంబికా కృష్ణన్. ముప్పై ఏళ్ళ క్రితం తనకి పాఠాలు చెప్పిన టీచర్ ని స్టేజ్ పైన చూడగానే బన్నీ ఎమోషనల్ అయ్యాడు. ఎంతో ప్రేమతో, వినయంతో అంబికా కృష్ణన్ కాళ్లకు నమస్కరించాడు. ఈ సందర్భంగా అంబికా కృష్ణన్ మాట్లాడుతూ… ‘‘నా కొడుకులాంటి వాడి గురించి నేనేం చెప్పేది. మంచి హీరోగా పేరు తెచ్చుకుని.. మా టీచర్లందరికీ గర్వకారణం అయ్యాడు. ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి.. ఎందరెందరో ప్రజల అభిమానానికి పాత్రుడయ్యాడు. మేము తనని ఎప్పుడూ అర్జున్ అని పిలవలేదు.. అల్లూస్ అని పిలిచేవాళ్లం. పుట్టడమే డ్యాన్సింగ్ షూస్‌తో పుట్టాడనిపిస్తుంది. తనని చూసి ఎంతో గర్వపడుతున్నాను. ఇలాగే ప్రజలను ఇంకా ఆనందపరుస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను..’’ అని అన్నారు.
బన్నీ, అంబికా కృష్ణన్ తో ఉన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ‘‘ఈమె పేరు అంబికా కృష్ణన్. మూడో తరగతిలో నా జాగ్రఫీ టీచర్. నేను చదువుకునే క్రమంలో ఎంతోమంది టీచర్స్ నాకు పాఠాలు చెప్పారు. కానీ, వారందరీలో ఈ టీచర్‌కే ప్రథమస్థానం ఇస్తాను. క్లాస్‌లో 50 మంది విద్యార్థులు ఉంటే నాదే లాస్ట్ ర్యాంక్. అంత పూర్ స్టూడెంట్‌ని నేను. అయినా కూడా ఆమె ఎప్పుడూ నన్ను తిట్టలేదు. అర్జున్.. జీవితం అంటే చదువు ఒక్కటే కాదు.. జీవితం అనేది ప్రతి ఒక్కరికీ వరం. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు నువ్వు కూడా తప్పకుండా ఉన్నత శిఖరాలకు వెళ్తావని అనేవారు. ప్రతి టీచర్ ఇలా ఉండాలని నేను కోరుకుంటాను. ఆమెను ఈరోజు ఇలా చూస్తుంటే నాకెంతో సర్‌ప్రైజింగ్‌గా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తి నింపేలా చిన్న చిన్న కోట్స్ రాయడం అలవాటు. అలా, నేను రాసిన ‘Only Kindness is Remembered Forever’ అనే కోట్‌కు నా ఈ టీచరే స్ఫూర్తి’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Allu Arjun Meets his Mother by Heart after 30 Years😢 Fall in love❤️ with the man Instantly!😍
🔗https://t.co/9WMdQp4SSe🔗@alluarjun #AlluArjun #Pushpa #PushpaTheRule #BehindwoodsGoldIcons #BGI2023 #Behindwoods pic.twitter.com/u8nc0x1jon
— Behindwoods (@behindwoods) May 10, 2023