తెలుగు చిత్రాలు -యన్టీఆర్ ‘జయసింహ’, ఏయన్నార్ ‘రోజులు మారాయి’తోనే వెలుగు చూసిన వహిదా రెహమాన్, హిందీ చిత్రసీమలో అందాలతారగా రాజ్యమేలారు. 1956లో గురుదత్ తన ‘సి.ఐ.డి.’ సినిమాతో వహిదాను హిందీ సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ సినిమా ఘనవిజయంతో బొంబాయితారగానే మిగిలిపోయారు వహిదా రెహమాన్. మొదట్లో గురుదత్, దేవానంద్ చిత్రాలలోనే మురిపించిన వహిదా రెహమాన్ తరువాత తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అలా ఆమెకు తొలి విజయాన్ని అందించిన చిత్రం ‘బీస్ సాల్ బాద్’. బిశ్వజిత్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు హేమంత్ కుమార్ నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి బీరేన్ నాగ్ దర్శకత్వం వహించారు. 1962 జనవరి 1న విడుదలైన ‘బీస్ సాల్ బాద్’ ఘనవిజయం సాధించి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషం!
‘బీస్ సాల్ బాద్’ కథ ఏమిటంటే – ఓ జమీందార్ కామాంధుడై ఓ అమ్మాయిని రేప్ చేస్తాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. తరువాత ఆమె ఆత్మనే జమీందార్ ను అతని కొడుకును చంపేసిందని ప్రచారం సాగుతుంది. ఇరవై ఏళ్ళ తరువాత ఆ భవంతికి జమీందార్ మనవడు కుమార్ వస్తాడు. అక్కడ మాలి రామ్ లాల్ సాదరంగా ఆహ్వానిస్తాడు. రామ్ లాల్ బంధువు రాధ. కుమార్ కు రాత్రి పూట ఓ పాట వినిపిస్తూ ఉంటుంది. అతనిపై కూడా దాడి జరుగుతుంది. కుమార్ కు రాధతో పరిచయం అవుతుంది. ఓ సారి కుమార్ చనిపోయాడని తెలిసి, రాధ విలపిస్తుంది. అయితే అతని కోటు తస్కరించి, వేసుకున్న వ్యక్తి మరణించి ఉంటాడు. కుమార్ అనుకొని దెయ్యం అతణ్ణి చంపిందని అంటారు. అప్పటి నుంచే కుమార్ కు అనుమానం కలుగుతుంది. కుమార్ లాంటి ధనవంతులు మోసం చేస్తారని రాధకు చెబుతాడు రామ్ లాల్. అయినా, రాధ, కుమార్ కలుసుకుంటూ ఉంటారు. కుమార్ పై మరోమారు దాడి సాగుతుంది. అతను చాకచక్యంగా తప్పించుకొని అసలు దోషి ఎవరో కనిపెడతాడు. దెయ్యంలా నాటకం నడిపిస్తోంది రామ్ లాల్ అని తేలుతుంది. రామ్ లాల్ కూతురునే జమీందార్ మానభంగం చేశాడని తెలుస్తుంది. ఆ కక్షతోనే రామ్ లాల్ అలా చేశాడని తేలుతుంది. పోలీసులు వచ్చి, రామ్ లాల్ ను బంధిస్తారు. కుమార్, రాధ ఆనందంగా జీవనం సాగించడంతో కథ ముగుస్తుంది.
‘బీస్ సాల్ బాద్’లో మన్మోహన్ కృష్ణ, మదన్ పురి, అజిత్ సేన్, సజ్జన్, లతా సిన్హా, దేవ్ కిషన్ ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి హేమంత్ కుమార్ సంగీతం సమకూర్చారు. షకీల్ బదయుని పాటలు పలికించారు. ఇందులోని “బేకరార్ కర్కే హమే…”, “కహీ దీప్ జలే కహీ దిల్…”, “సప్నే సుహానే..”, “యే మొహబ్బత్ మే…”, “జరా నజ్రోంసే కహో దో…” పాటలు అలరించాయి. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో, ఈ స్ఫూర్తితో అనేక చిత్రాలు దక్షిణాదిన ఊపిరి పోసుకున్నాయి.