నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై నిర్వహిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ వరుసగా రెండు ఎపిసోడ్స్ ప్రసారమయిన తరువాత కొంత గ్యాప్ వచ్చింది. వరుసగా ప్రసారం కావడానికి ఇదేమైనా సీరియలా.. సెలబ్రేషన్.. అంటూ బాలకృష్ణ తన ప్రచార వాక్యాలతో మూడో ఎపిసోడ్ ను అందరినీ అలరిస్తూ ఆరంభించారు. ఈ మూడో ఎపిసోడ్ నవ్వుల పువ్వులు పూయించడమే ప్రధాన లక్ష్యంగా కనిపించింది. గతంలో రెండు ఎపిసోడ్స్ కంటే మిన్నగా ఈ మూడో ఎపిసోడ్ లో హాస్యం చిందులు వేసింది.
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, హాస్య చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఇందులో అతిథులుగా పాల్గొనడమే అందుకు కారణం. హాస్య చిత్రాల ద్వారా తెలుగువారిని విశేషంగా అలరించిన దర్శకులు జంధ్యాల రాసిన నవ్వడం యోగం.. నవ్వించడం భోగం..నవ్వకపోవడం రోగం.. అంటూ బాలయ్య తనదైన శైలిలో ఉచ్చరించారు. అది ప్రేక్షకుల్లో నవ్వులు పూయించింది. చిత్రసీమకు బ్రహ్మానందాన్ని పరిచయం చేసిన జంధ్యాల కోట్ తో ఈ మూడో ఎపిసోడ్ ప్రారంభం కావడం, అలాగే ఇందులో మరో అతిథిగా పాల్గొన్న అనిల్ రావిపూడి తాను కూడా జంధ్యాల స్ఫూర్తితోనే నవ్వులు పూయిస్తూ ఉంటానని చెప్పడం కూడా ఆకట్టుకుంది.
బాలకృష్ణ ఈ ఎపిసోడ్ లో పరిచయ వాక్యాలు చెబుతూ ఉండగానే బ్రహ్మానందం వేదికపైకి అడుగుపెట్టడం, దానికి బాలయ్య తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తంచేసి, ఓ బౌన్సర్ ను పిలిచి, ఇతణ్ణి పట్టుకోమని చెప్పడంతో అతను బ్రహ్మానందాన్ని లాక్కుపోవడం కూడా నవ్వులు పూయించాయి. తరువాత అనిల్ రావిపూడి రావడం, తన ఫ్రస్ట్రేషన్ బోర్డర్ దాటింది.. అంటూ బాలయ్య అనడం అందుకు అనిల్ వణికిపోయినట్టు నటిస్తూ, సార్.. బాలకృష్ణ గారంటేనే ఎనర్జీ..ఎనర్జీ అంటేనే మీరు.. అని చెప్పడం నవ్వులు పూయించాయి. తరువాత ఇందాకటి మనిషిని పట్టుకురండి అనగానే బ్రహ్మానందంను కప్పులేని పల్లకిలో మోసుకు వచ్చారు. ఆయనకు కిరీటం కూడా ధరింపచేశారు. ఆయనను చూసి బాలయ్య, ఈయనలో తెనాలి రామకృష్ణుని పోలికలు ఉన్నాయి అని చెప్పడం, అందుకు బ్రహ్మానందం మీలో శ్రీకృష్ణదేవరాయలు కనిపిస్తున్నారని చెప్పడం హాస్యం పండించాయి.
అతిథులుగా వచ్చిన బ్రహ్మానందం, అనిల్ రావిపూడిని కూర్చోబెట్టడంలోనూ బాలయ్య భలేగా నవ్వులు పూయించారు. బ్రహ్మానందం తాను యన్టీఆర్ అభిమానని చెప్పడం, కాదు మీరు ఏయన్నార్ ఫ్యాన్ అని బాలయ్య చెప్పడం సరదాగా సాగింది. బ్రహ్మానందం పాండవవనవాసములో దుర్యోధనుని ఉద్దేశించి, యన్టీఆర్ చెప్పిన డైలాగ్ ను అభినయించి ఆకట్టుకున్నారు. తరువాత బాలయ్యను బ్రహ్మానందం ఏయన్నార్ లా నటించమని కోరగా, ఆయన చాణక్య-చంద్రగుప్తలోని చాణక్యునిగా అభినయించడం మరింతగా నవ్వులు కురిపించాయి.
తరువాత బ్రహ్మానందంపై సోషల్ మీడియాలో దర్శనమిచ్చే మీమ్స్ లో నెల్లూరు పెద్దారెడ్డి... అంటూ ఆయన అనగనగా ఒక రోజులో నటించిన తీరును అనిల్ అభినయించి చూపడం ఆకట్టుకుంది. ఈ నవ్వుల పువ్వులు రాలుతూ ఉండగా, మధ్యలో డ్రైవర్ గా లైసెన్స్ సంపాదించిన మరుగుజ్జు శివలాల్ తన అనుభవాన్ని చెప్పడం, తనలాంటి మరుగుజ్జులకు ఫ్రీగా డ్రైవింగ్ నేర్పిస్తానని సెలవియ్యడం జరిగింది. ఆయనను, ఆయన భార్యను బాలకృష్ణ అభినందించడం అలరించింది.
బ్రహ్మానందం కనిపిస్తే చాలు నవ్వులు పూస్తాయి. అలాంటి బ్రహ్మానందం, బాలయ్యతో లారీ డ్రైవర్లో నటించే సమయంలో సాగిన ఓ సంఘటనను గుర్తు చేసి మరీ నవ్వించారు. అలాగే మేజర్ చంద్రకాంత్ లో యన్టీఆర్ తో నటించే సమయంలో తన అనుభవాలనూ బ్రహ్మానందం పంచుకున్నారు. అలా నవ్విస్తూనే జీవితమంటే పోరాటం... జీవితంలోనవ్వులు, కన్నీళ్ళు రెండూ ఉంటాయి. రెంటినీ సమానంగా స్వీకరించినప్పుడే జీవితం ఆనందమయం`` అవుతుందనే జీవితసత్యాన్ని బ్రహ్మానందం తెలిపారు.
బాలయ్య ముగింపులో అతిథులకు బహుమతులు అందిస్తున్న సమయంలోనూ మళ్ళీ నవ్వులు పూశాయి. ఇలా సాగిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 3 జనాన్ని భలేగా అలరిస్తుందని చెప్పవచ్చు. అసలే బాలయ్య తాజా చిత్రంఅఖండ` అనూహ్యంగా జనాన్ని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నవ్వుల పువ్వులు పూయించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కావడం అభిమానులను మరింతగా అలరిస్తుందని చెప్పవచ్చు.