నటసింహ నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అడుగు పెడుతూ ‘అన్ స్టాపబుల్’ అనే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్ నవంబర్ 4న దీపావళి కానుకగా ‘ఆహా’లో మొదలు కానుంది. ఈ ప్రోగ్రామ్ ను పరిచయం చేసే వేడుక గురువారం జరిగింది. ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఆహా’ భాగస్వామి అయిన అల్లు అరవింద్ ను ఉద్దేశించి, ” పొట్టివాడు గట్టివాడు” అని నవ్వుతూ అన్నారు. అయితే ఈ కార్యక్రమం అయిన తరువాత అక్కడకు హాజరయిన వారిలో చాలామంది నిజంగానే పొట్టివాడు మహా గట్టివాడు అనడం వినిపించింది.
Read Also : హిందీ పరిశ్రమ గొప్ప అనుకునే వాళ్లకు… అల్లు అరవింద్ కామెంట్స్
నిజానికి ఇంతకు ముందు ‘ఆహా’లో ప్రసారం కానున్న కార్యక్రమాలకు చెందిన పరిచయ సమావేశం ఏర్పాటు చేసిన ప్రతీసారి, మీడియా ఇంటరాక్షన్ ఉండేది. అయితే ఈ సారి బాలకృష్ణ వంటి టాప్ స్టార్ తో ‘అన్ స్టాపబుల్’ టాక్ షో నిర్వహిస్తున్నా, మీడియా ఇంటరాక్షన్ ఏర్పాటు చేయలేదు. ఆ విషయంపైనా అక్కడికి వచ్చిన వారు చర్చించుకున్నారు. ఒకవేళ బాలయ్యతో మీడియా ఇంటారక్షన్ ఏర్పాటు చేసి ఉంటే, ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు చర్చకు వచ్చేవి. వాటిని చర్చిస్తే, వాటిపై బాలయ్య ఏమైనా స్పందించి ఉంటే ఈ ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సంగతి పక్కకు పోయి, ‘మా’ ఎలక్షన్స్ పై బాలయ్య స్పందన హైలైట్ అయ్యేది. ఆ కారణంగానే ఈ సారి మీడియా ఇంటరాక్షన్ ఏర్పాటు చేయలేదని భావించవచ్చు. గతంలో ‘ఆహా’ ఓటీటీలో సాగిన ప్రోగ్రామ్స్ కు మీడియా ఇంటరాక్షన్ ఏర్పాటు చేసిన అల్లు అరవింద్, ఓ వ్యూహం ప్రకారమే ఈ సారి బాలయ్యతో మీడియావారిని కలవనివ్వలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని తలచుకుంటే అరవింద్ ను నిజంగానే ‘పొట్టివాడు మహా గట్టివాడు’ అనక తప్పదు.