Avatar The Way of Water to Feature Music from The Weeknd: ప్రముఖ కెనడియన్ సింగర్ ‘ద వీకెండ్’ పేరులోనే గమ్మత్తు ఉంటుంది. ‘ద వీకెండ్’ పేరేమిటి? అవును, ఆ పేరుతోనే ఈ కెనడా గాయకుడు ప్రాచుర్యం పొందారు. ఆయన అసలు పేరు ఏబెల్ మక్కోనెన్ టెస్ఫాయే. 32 ఏళ్ళ ద వీకెండ్ పాట అంటే కెనడియన్స్ పడిచచ్చిపోతారు. విఖ్యాత దర్శకుడు జేమ్స్ కేమరాన్ తాజా చిత్రం ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ కోసం వీకెండ్ ఓ బాణీని కూర్చి నెట్టింట పెట్టారు. అసలే ‘అవతార్-2’కు ఉన్న క్రేజ్ తో ద వీకెండ్ కు కూడా దేశవిదేశాల్లో ఆదరణ లభిస్తోంది. ‘అవతార్- 2’ కోసం ద వీకెండ్ బాణీల్లో రూపొందిన క్లిప్ 12 సెకండ్ల పాటు సాగుతుంది. ఇందులో ‘ఎ’ అనే ఇంగ్లిష్ లెటర్ తో పాటు ఓ పక్షి కూడా నీలిరంగులో కనిపిస్తుంది. వెనకాల కోరస్ నీటి శబ్దంతో వినిపించడం విశేషం! ఈ మ్యూజిక్ బిట్ కు “12.16.22” అని ద వీకెండ్ క్యాప్సన్ పెట్టడం ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ విడుదల తేదీని గుర్తు చేస్తోంది. ఇలా తన క్రియేటివిటీతో ద వీకెండ్ పొందు పరచిన మ్యూజిక్ బిట్ ఇప్పుడు ‘అవతార్’ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే ‘అవతార్-2’ నిర్మాతలు, ఈ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఓపెనింగ్ 150 మిలియన్ డాలర్లు పోగేసే ప్రయత్నంలో ఉన్నారు. మన కరెన్సీలో రూ.1,227.75 కోట్ల రూపాయలన్న మాట! ఓపెనింగ్ వీకెండ్ 200 మిలియన్ డాలర్లు టార్గెట్ గా ఎంచుకున్నారు. అంటే శుక్రవారం కాకుండా, తరువాతి శని, ఆదివారాల్లో కేవలం 50 మిలియన్ డాలర్లనే టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ, ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మరింత పెరిగే అవకాశమూ ఉందని సినీపండిట్స్ అంటున్నారు. 2009లో విడుదలైన ‘అవతార్-1’ చిత్రం 237 మిలియన్ డాలర్స్ పెట్టుబడితో రూపొంది, 2.923 బిలియన్ డాలర్లు పోగేసింది. అంటే12 రెట్లు కొల్లగొట్టింది. ‘అవతార్-2’ బడ్జెట్ 400 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. మొదటి వారం రోజుల్లోనే ఈ పెట్టుబడిని రాబట్టాలంటే ఓపెనింగ్ వీకెండ్ కనీసం 300 మిలియన్ డాలర్లు పోగేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండిట్స్ లెక్కలు కడుతున్నారు. ఏది ఏమైనా, మొదటి భాగం కంటే దాదాపు 163 మిలియన్ డాలర్ల ఎక్కువ పెట్టుబడితో రూపొందిన ఈ ‘అవతార్-2’ ఫస్ట్ పార్ట్ ను అధిగమిస్తుందో లేదో అనీ సినీజనం భావిస్తున్నారు. ‘అవతార్-2’ కోసం ద వీకెండ్ రూపొందించిన మ్యూజిక్ బిట్ సినిమాకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి. అలాగే ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ జేమ్స్ కేమరాన్ తో పాటు నిర్మాతలను ముంచుతుందో తేలుస్తుందో చూద్దాం.