Avatar Ticket Prices: విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరాన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ‘అవతార్- ద వే ఆఫ్ వాటర్’ సినిమా డిసెంబర్ 16న జనం ముందు నిలువనుంది. మన దేశంలోనూ ‘అవతార్-2’పై ఎంతో క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు పాతిక రోజులు ముందుగానే మన దేశంలోని కొన్ని ప్రధాన నగరాలలో మంగళవారం (నవంబర్ 22) నుండి అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టారు. ఓ సినిమా కోసం ఇన్ని రోజులు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించడమన్నది ఆసక్తి కలిగించే అంశమే. మన దేశంలో రూపొందిన క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్స్ కే ఇన్ని రోజులు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టారు. అలాంటిది జేమ్స్ కేమరాన్ ‘అవతార్-2’ కోసం ఈ స్థాయిలో బుకింగ్స్ ఆరంభించడం నిజంగా విశేషమనే చెప్పాలి.
‘అవతార్- ద వే ఆఫ్ వాటర్’ సినిమా మన దేశంలోని ప్రధాన నగరాల్లో ఒక్కో చోట ఒక్కో ఫార్మాట్‌కు తగిన రేట్లు నిర్ణయించారు. మన హైదరాబాద్ లో 4డిఎక్స్ 3డి కి రూ. 350 నిర్ణయమైంది. ఇంకా మన రాజధానిలో ఐమాక్స్ ఫార్మాట్ రేటు గురించి వివరించలేదు. బెంగళూరులో ఐమాక్స్ 3డీ ఫార్మాట్ కు రూ.1450 నిర్ణయించారు. ముంబైలో 4డీఎక్స్ 3డీకి రూ. 970 కాగా, పక్కనే ఉన్న పూనెలో అదే ఫార్మాట్ కు రూ.1200 నిర్ణయించడం గమనార్హం.
Read Also: Superstar Krishna: ప్రతి ఏడాది కృష్ణ స్మారక అవార్డు ప్రదానం
దేశరాజధాని ఢిల్లీలో ఐమాక్స్ 3డీ ఫార్మాట్ కు టిక్కెట్ ధరను వేయి రూపాయలు చేశారు. కోల్ కత్తాలో అదే ఐమాక్స్ 3డీకి రూ.770 కాగా, అహ్మదాబాద్ లో 4డీఎక్స్ 3డీకి రూ. 750 నిర్ణయమైంది. చండీగఢ్‌లో 4డీఎక్స్ 3డీకి రూ. 450 కాగా, అదే ఫార్మాట్‌ను ఇండోర్‌లో రూ.700 చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో 3డీ ఫార్మాట్‌కు రూ.210 నిర్ణయించారు. అయితే ఈ రేట్లన్నీ రెగ్యులర్ సీట్లకు నిర్ణయించినవే. కాగా, థియేటర్లలో రిక్లైనర్ సీట్లకు అదనపు రుసుము ఉంటుందని పేర్కొన్నారు. కేవలం ఈ నగరాలలోనే కాదు చెన్నై, త్రివేండ్రం వంటి నగరాల్లోనూ ఈ సినిమా ఫార్మాట్‌ను బట్టి టిక్కెట్ రేట్లు నిర్ణయించి అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చేస్తున్నారు.
ఇక్కడ పేర్కొన్న రేట్లలో అన్నింటి కన్నా బెంగళూరులో ఐమాక్స్ 3డీ ఫార్మాట్ రేటు రూ.1450 అధికంగా ఉండగా, అన్నిటిలోకి తక్కువగా వైజాగ్‌లో 3డీ ఫార్మాట్‌కు రూ.210 మాత్రమే ఉంది. అలాగే హైదరాబాద్ థియేటర్లలోని రెగ్యులర్ సీట్లకు ఈ సినిమా 4డీఎక్స్ 3డీ ఫార్మాట్‌కు రూ.350 నే నిర్ణయించారు. ఏది ఏమైనా ఈ స్థాయిలో నిర్ణయించిన రేట్లతో మహానగరాల్లో సందడి చేయనున్న ‘అవతార్’ మన దేశంలోని ఏ,బీ,సీ కేంద్రాలలోనూ తన సత్తా చాటనుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఆయా కేంద్రాలలో ఎప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయో కానీ, అక్కడ కూడా రికార్డ్ స్థాయిలోనే టిక్కెట్ల అమ్మకాలు సాగుతాయని భావిస్తున్నారు. ఏది ఏమైనా మొదటి రోజునే భారతదేశం నుండి ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ వందలాది కోట్లు పోగు చేయనుందని తెలుస్తోంది. అనువాద చిత్రాల్లో ‘అవతార్-2’ నెలకొల్పనున్న రికార్డ్ ను సైతం ఇప్పట్లో అధిగమించే చిత్రం కానరాదనీ సినీ పండిట్స్ అంటున్నారు. మరి డిసెంబర్ 16న మన దేశంలో ‘అవతార్’ సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
Read Also: Yevam: చాందిని చౌదరి హీరోయిన్ గా నవదీప్ సొంత సినిమా!