ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ‘అతడు ఆమె ప్రియుడు’. సునీల్, ‘బిగ్ బాస్’ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా తొలికాపీ ఇప్పటికే సిద్ధమైంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ను వైజాగ్ అవంతి కాలేజీలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్ కు కథలు అందించిన యండమూరి వీరేంద్ర నాథ్ కు నేను పెద్ద అభిమానిని. ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ప్రఖ్యాత దర్శకులు కె. రాఘవేంద్రరావు విడుదల చేసిన ‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్ కి అనూహ్య స్పందన లభించిందని, మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు రిలీజ్ చేసిన టీజర్ కు కచ్చితంగా మరింత మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉందని నిర్మాతలు రవి కనగాల, తుమ్మలపల్లి రామ్ పేర్కొన్నారు. యండమూరి వంటి లెజెండ్ దర్శకత్వంలో నటించే అవకాశం లభించడం పట్ల కౌశల్, హీరోయిన్ మహేశ్వరి, నటుడు భూషణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.