Aswani Dutt May Become New TTD Chairman: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేసిన తెలుగుదేశం, బిజెపి, జనసేన భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి 135 సీట్లు రాగా జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొందింది. బిజెపి ఎనిమిది స్థానాలు దక్కించుకుంది. అయితే అధికార వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అయితే నిన్నటి నుంచి ప్రొడ్యూసర్ అశ్వని దత్ చలసాని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడే ఆయన తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు వస్తాయని జైల్లో కలిసిన అనంతరం మీడియాకు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే టీడీపీ 160 పైగా స్థానాలు దక్కించుకోవడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు కూడా అశ్విని దత్ చంద్రబాబు గెలవాలని ఆకాంక్షిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ముందు నుంచి కూడా అశ్విని దత్ చంద్రబాబుకి మద్దతుగానే నిలుస్తూ వస్తున్నారు.
NEET UG 2024: నీట్ లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన రాజస్థాన్ అమ్మాయి..ఏం చెప్పిందంటే?
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారం మొదలైంది. అదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అశ్వని దత్ కి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ పదవి కోసం సినీ పరిశ్రమ నుంచి మురళీమోహన్ చాలా ప్రయత్నాలు చేశారు కానీ సామాజిక సమీకరణాలు నేపథ్యంలో ఆయనకు ఆ పదవి అయితే దక్కలేదు. ఇక ఇప్పుడు అశ్వినీ దత్ కి టీటీడీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ హయాంలో కొన్నాళ్లు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి కూడా టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. నిన్న ప్రభుత్వం మారిపోతుందన్న సూచనలు వచ్చిన వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వెంటనే తన రాజీనామా లేఖను టీటీడీ ఈవోకి పంపించారు. అయితే అశ్వినీ దత్ కి నిజంగానే టీటీడీ చైర్మన్ అవుతారా? లేక ఇది ప్రచారానికే పరిమితం అవుతుందా? అనే అంశం తెలియాల్సి ఉంది.