ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్’ నుండి ఓ సినిమా వస్తోందంటే చాలు జనం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సంస్థాధినేత సి.అశ్వనీదత్ సైతం ప్రేక్షకులను మెప్పించే చిత్రాలను అందించడానికే అమితోత్సాహంతో ఉంటారు. మహానటుడు నటరత్న యన్.టి.రామారావు చేతుల మీదుగా ‘వైజయంతీ మూవీస్’ సంస్థ ఆరంభమైంది. యన్టీఆర్ అభిమానిగా ఆయనతోనే ‘ఎదురులేని మనిషి’ చిత్రం నిర్మించి, తమ వైజయంతీ మూవీస్ కు శ్రీకారం చుట్టారు అశ్వనీదత్. తరువాత టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ చిత్రాలను నిర్మించి జనం మదిలో మరపురాని స్థానం సంపాదించారు అశ్వనీదత్. తాజాగా ‘సీతారామమ్’తో మరోమారు జనాన్ని అలరించారు అశ్వనీదత్.
అశ్వనీదత్ 1950 సెప్టెంబర్ 15న జన్మించారు. ఆయన తండ్రి సి.ధర్మరాజు ధనవంతులు. తనయుడి అభిరుచిని ఆయన ఎన్నడూ కాదనేవారు కారు. దాంతో సినిమారంగంలో అడుగు పెట్టి, చిత్రాలు నిర్మించాలని ఉందని తనయుడు అశ్వనీదత్ తెలుపగానే, ఆయన కూడా ప్రోత్సహించారు. తొలుత మిత్రుడు ఎ.ఆర్.ఎస్. శర్మతో కలసి సావరిన్ సినీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ‘ఓ సీత కథ’ నిర్మించారు దత్. ఆ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టింది. తన అభిమాన నటుడు యన్టీఆర్ ను కలసి ఆయనతో సినిమా తీస్తానని పట్టు పట్టారు దత్. కుర్రాడిలో ఉత్సాహం ఉందనుకున్న యన్టీఆర్ సరే అన్నారు. సొంత బ్యానర్ పేరు రామారావునే సూచించమన్నారు దత్. యన్టీఆర్ సూచించిన ‘వైజయంతీ’ పేరునే బ్యానర్ గా పెట్టుకొని తొలి ప్రయత్నంలో యన్టీఆర్ హీరోగా కె.బాపయ్య దర్శకత్వంలో ‘ఎదురులేని మనిషి’ నిర్మించారు. ఆ చిత్రం వసూళ్ళ వర్షం కురిపించి, దత్ నిర్మాతగా నిలదొక్కుకొనేలా చేసింది. తరువాత యన్టీఆర్ తోనే ‘యుగపురుషుడు’ నిర్మించారు. తరువాత ఇతర హీరోలతో సినిమాలు తీయండి, మీకు మంచి భవిష్యత్ ఉందన్నారు యన్టీఆర్. ఆయన చెప్పిన తరువాతే దత్ ఇతర హీరోలతో చిత్రాలు నిర్మించడం మొదలు పెట్టారు. తన బ్యానర్ లోగోలో ‘శ్రీకృష్ణావతారం’లో యన్టీఆర్ విజయశంఖారావం చేసే బొమ్మనే పెట్టుకున్నారు దత్.
యన్టీఆర్ తో రెండు చిత్రాలు తీసిన అశ్వనీదత్ ఏయన్నార్ తో “గురుశిష్యులు, బ్రహ్మరుద్రులు” నిర్మించారు. ఈ రెండు చిత్రాలలో వేరే హీరోలు కూడా ఉన్నారు. కృష్ణ, కృష్ణంరాజుతో ‘అడవిసింహాలు’ తెరకెక్కించారు. కృష్ణతో సోలోగా ‘అగ్నిపర్వతం’ తీశారు. చిరంజీవితో “జగదేకవీరుడు-అతిలోకసుందరి, చూడాలనివుంది, ఇంద్ర, జై చిరంజీవా” చిత్రాలు నిర్మించారు. బాలకృష్ణతో ‘అశ్వమేధం’, అందులోనే శోభన్ బాబుతో ఓ కీ రోల్ పోషింపచేశారు. నాగార్జునతో “ఆఖరి పోరాటం, గోవింద గోవిందా, రావోయి చందమామా, ఆజాద్” తెరకెక్కించారు. వెంకటేశ్ తో ‘బ్రహ్మరుద్రులు, సుభాష్ చంద్రబోస్’ తీశారు. పవన్ కళ్యాణ్ తో ‘బాలు’, జూనియర్ యన్టీఆర్ తో “కంత్రి, శక్తి” చిత్రాలు నిర్మించారు. మహేశ్ బాబును హీరోగా పరిచయంచేస్తూ ‘రాజకుమారుడు’ తెరకెక్కించారు. ఆయనతోనే ‘సైనికుడు’ నిర్మించారు. రామ్ చరణ్ ను హీరోగా పరిచయంచేస్తూ ‘చిరుత’ రూపొందించారు. ఇలా మూడు తరాల టాప్ స్టార్స్ తో చిత్రాలు తెరకెక్కించారు సి.అశ్వనీదత్. వీటిలో కొన్ని బ్లాక్ బస్టర్స్ గానూ నిలిచాయి.
కేవలం వైజయంతీ మూవీస్ పతాకంపైనే కాకుండా స్వప్న సినిమా పతాకంపైనా ఆయన సినిమాలు నిర్మించారు. ఈ బ్యానర్ పై రూపొందిన ‘స్టూడెంట్ నంబర్ వన్’ ద్వారా రాజమౌళిని దర్శకునిగా పరిచయంచేశారు. ‘ఒకటో నంబర్ కుర్రాడు’తో తారకరత్నను హీరోని చేశారు. ‘ఎవడే సుబ్రమణ్యం’తో నాగ్ అశ్విన్ ను దర్శకునిగా నిలిపారు.
‘మహానటి’ చిత్రం కూడా ఇదే బ్యానర్ పై తెరకెక్కింది. ఆ మధ్య ఘనవిజయం సాధించిన ‘జాతి రత్నాలు’ కూడా ఈ పతాకంపైనే రూపొందింది.
త్రీ ఏంజెల్స్ అనే బ్యానర్ పై కూడా దత్, ఆయన కూతుళ్ళు చిత్రాలు నిర్మించారు. ఈ బ్యానర్ లో “బాణం, ఓం శాంతి, సారొచ్చారు” వంటి సినిమాలు రూపొందాయి. రాఘవేంద్ర మూవీ కార్పోరేషన్, సిరీ మీడియాఆర్ట్స్, యునైటెడ్ ప్రొడ్యూసర్స్ వంటి బ్యానర్స్ లోనూ అశ్వనీదత్ భాగస్వామిగా ఉన్నారు. ఈ సంస్థల ద్వారా వెలుగు చూసిన ‘పెళ్ళిసందడి’తో శ్రీకాంత్ స్టార్ హీరో అయ్యారు. ‘గంగోత్రి’తో అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యారు. శ్రీప్రియాంక పిక్చర్స్ అనే పతాకంపై ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో దత్ తెరకెక్కించిన ‘శుభలగ్నం’ మంచి విజయం సాధించింది. ఇలా అనేక మంది స్టార్స్ తో చిత్రాలు నిర్మించిన ఏకైక నిర్మాతగా సి.అశ్వనీదత్ తెలుగు చిత్రసీమలో నిలిచారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ టైమ్ ట్రావెలింగ్ మూవీ తీసే ప్రయత్నంలో ఉన్నారు అశ్వనీదత్. ఆ సినిమాతో తమ ‘వైజయంతీ మూవీస్’ వైభవాన్ని మరింత వెలిగేలా చేస్తారేమో అశ్వనీదత్ చూడాలి.