Ashwini Dutt: టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంశంపై వివాదం నడుస్తోంది. తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో నిర్మాతల శ్రేయస్సు కోసమే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటైంది కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియట్లేదని అశ్వినీదత్ ఆరోపించారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లోని కొందరు నిర్మాతలే కారణమని.. వాళ్లకు ఇష్టం వచ్చినప్పుడు టిక్కెట్ రేట్లు పెంచి.. కష్టం వచ్చినప్పుడు తగ్గించాలని కోరడంతోనే అసలు సమస్య వచ్చిందని మండిపడ్డారు. వీళ్ల వైఖరి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని అశ్వినీదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు, ఇప్పుడు పనిచేస్తున్న గిల్డ్‌కు అసలు పోలిక లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: Ramarao On Duty: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్విట్టర్ టాక్ ఏంటి?
అయితే అశ్వినీదత్ సడెన్‌గా యూటర్న్ తీసుకున్నారు. నిర్మాతల నిర్ణయమే తన నిర్ణయం అంటూ మీడియాకు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. యాభై ఏళ్లుగా చిత్రసీమలో నిర్మాతగా కొనసాగుతున్నానని.. తన తోటి నిర్మాతలందరితోనూ చాలా సన్నిహితంగా, సోదర భావంగా మెలిగానని తెలిపారు. ఏ నిర్మాతపైనా తనకు అగౌరవం లేదన్నారు. గిల్డ్ అయినా, కౌన్సిల్ అయినా… నిర్మాతలు, చిత్రసీమ శ్రేయస్సు కోసమే ఉద్భవించాయన్నారు. పరిశ్రమ కోసం అందరూ ఒక్క తాటిపై నడిచి మంచి నిర్ణయాలు తీసుకొంటే బాగుంటుందని తన అభిప్రాయం అన్నారు. నిర్మాతలంతా కలిసి చిత్రసీమ గురించి ఏ మంచి నిర్ణయం తీసుకొన్నా తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ప్రస్తుతం అశ్వనీదత్ నిర్మించిన సీతారామం మూవీ ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కానుంది.