ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు, సునీత తాటి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో ఫస్ట్ సర్వైవల్ థ్రిల్లర్. సతీష్ త్రిపుర దర్శకత్వం వహించిన ఈ మూవీకి శ్రీసింహ సోదరుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీసింహ మాట్లాడుతూ, ”నా కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి గొప్ప కాన్సెప్ట్ వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. తెలుగులో ఇలాంటి సినిమా ఇంతవరకూ ఎవరూ చేయలేదు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం కోసం నన్ను ఎంపిక చేసుకున్నందుకు సురేష్ బాబు గారు, సునీత గారు, దర్శకుడు సతీష్ కి కృతజ్ఞతలు. ఇలాంటి సినిమాలకు రచన చాలా బలంగా వుండాలి. సతీష్ గారు అద్భుతంగా రాసి, తీశారు. ప్రీతి అస్రాణి పాత్ర చాలా ప్రభావంతంగా వుంటుంది. శ్రీకాంత్ అయ్యంగార్ తన అనుభవాన్ని ఈ కథలో చాలా గొప్పగా యాడ్ చేశారు. సముద్రఖని గారి ప్రజన్స్ తో సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళుతుంది. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ బ్రిలియంట్ వర్క్ చేశారు. రామానాయుడు స్టూడియోలో చాలా అద్భుతమైన సెట్ వేశారు. డీవోపీ యశ్వంత్ గొప్ప కెమెరా వర్క్ అందించారు. ఒకే లొకేషన్ చూడడం ప్రేక్షకులకు మొనాటనీ అనిపిస్తుంది కదా అనే ఫీలింగ్ వుండేది. కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఆ ఫీలింగే రాలేదు” అని అన్నారు.
కాల భైరవ మాట్లాడుతూ, ”ఈ మూవీ ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత నా పట్ల చాలా గర్వంగా ఫీలయ్యాను. రేపు ప్రేక్షకులు కూడా ఒక గొప్ప సినిమా చుశామనే అనుభూతిని పొందుతారు” అని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన సునీత తాటి మాట్లాడుతూ, ”’దొంగలున్నారు జాగ్రత్త’ చాలా కొత్త అనుభవాన్ని ఇచ్చింది. సతీష్ విజన్ వున్న దర్శకుడు. శ్రీసింహ ఇందులో రాజు అనే పాత్రని అద్భుతంగా పోషించాడు. భవిష్యత్ లో సింహతో కలసి మరిన్ని సినిమాలు చేయాలని వుంది. ప్రీతి అస్రాణి చాలా కీలక పాత్ర పోషించింది. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ తో పాటు మిగతా సాంకేతిక నిపుణులు బ్రిలియంట్ వర్క్ చేశారు. ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా వుంది. చాలా యూనిక్ మూవీ ఇది” అని చెప్పారు.
దర్శకుడు సతీష్ త్రిపుర మాట్లాడుతూ.. నాపై నమ్మకం వుంచిన నిర్మాతలు సురేష్ బాబు, సునీత గారికి కృతజ్ఞతలు. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ కెరీర్ మొదలుపెట్టి సురేష్ ప్రొడక్షన్స్ తో దర్శకుడిగా పని చేయడం ఆనందంగా వుంది. సురేష్ బాబు గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. వెంకటేష్ గారు ‘దృశ్యం’ సినిమాకి అసోసియేట్ గా పని చేశాను. సునీత గారు ఈ చిత్రానికి బ్యాక్ బోన్. ఈ కథని డెవలప్ చేయడానికి రవి గారు చాలా సపోర్ట్ చేశారు. ఆయనకి కృతజ్ఞతలు. శ్రీసింహ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. తెరపై అది కనిపిస్తుంది. ఎడిటర్ గ్యారీ బీ హెచ్ కి థాంక్స్. తెలుగులో వస్తున్న మొదటి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇది. మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అని హామీ ఇచ్చారు. ప్రీతి అస్రాణి మాట్లాడుతూ, ”ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఇలాంటి కథ, కాన్సెప్ట్ ఎప్పుడూ వినలేదు. ఇందులో నీరజ అనే పాత్రలో కనిపిస్తాను. కథలో చాలా బలమైన పాత్రది. చాలా సర్ప్రైజ్ గా వుంటుంది” అని తెలిపింది. ఈ కార్యక్రమంలో డీవోపీ యశ్వంత్ సి, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు పాల్గొన్నారు.