ఈ రోజుల్లో ఒక సినిమా వారం రోజులు ప్రదర్శితమవడమే గొప్ప విషయంగా మారింది. పెద్ద హీరోల చిత్రాలు సైతం వారాంతం వరకే సందడి చేసి, ఆ తర్వాత నెమ్మదిస్తున్నాయి. సినిమాకు బలమైన పాజిటివ్ మౌత్ టాక్ వస్తే తప్ప, రెండో వారం ఆడటం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో, గత వారం విడుదలైన ‘అరి’ చిత్రం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి నుంచీ మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియాలో ‘అరి’ సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో, సినిమా మెల్లగా పుంజుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఈ చిత్రాన్ని రెండో వారం కూడా కొనసాగించాలని మేకర్లు నిర్ణయించారు.
ఈ వారం దీపావళి సీజన్ కావడంతో ‘మిత్ర మండలి’, ‘డ్యూడ్’, ‘తెలుసు కదా’, ‘కె ర్యాంప్’ అనే నాలుగు కొత్త చిత్రాలు బరిలోకి దిగాయి. అయినా కూడా, ‘అరి’ చిత్రం ఈ కొత్త చిత్రాలతో పాటు రెండో వారంలోనూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. సినిమాకు పదో రోజు కూడా మంచి స్పందన వస్తుండటంతో దర్శకుడు జయ శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. పదో రోజు తాను కూడా ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షిస్తున్నట్లు ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది.