AR Rahman Speech At Ponniyin Selvan Pre Release Event: భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం రూపొందించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్-1’ ఈనెల 30వ తేదీన భారీఎత్తున విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరు పెంచిన చిత్రబృందం.. శుక్రవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఈ సినిమాకు సంగీతం అందించిన ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ విచ్చేశాడు. ఈయన వేదిక మీదకు రాగానే.. ఫ్యాన్స్ అందరూ ఈలలు, అరుపులతో ఒక్కసారిగా ఆ వేదికను హోరెత్తించారు. అందుకు ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపిన ఏఆర్ రెహమాన్.. తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు.
తాను 38 సంవత్సరాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేస్తున్నానని.. రమేష్ నాయుడు దగ్గర నుంచి చక్రవర్తి, రాజ్ కోటి, సత్యం వంటి హేమాహేమీలతో కలిసి వర్క్ చేశానని ఏఆర్ రెహమాన్ తెలిపాడు. తెలుగు సంగీతం అనేది ఒక ఫౌండేషన్ లాంటిదని, తన సంగీతాన్ని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలని తెలిపాడు. ఇక తాను పొన్నియిన్ సెల్వన్ -1 సినిమా చూసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ సహా ఇతర ఫారిన్ సిరీస్‌లన్నీ చూడటం మానేశానని చెప్పాడు. ఎందుకంటే, మన భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఇందులో నటీనటులందరూ అద్భుతంగా నటించారని కొనియాడారు.
తనకు ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు మణిరత్నంకి థాంక్స్ చెప్పుకున్న ఏఆర్ రెహమాన్.. తన యూఎస్ టూర్‌కి వచ్చినందుకు తెలుగు ఆడియన్స్‌కి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ఇక అనంత శ్రీరామ్ తెలుగులో అద్భుత సాహిత్యం అందించాడంటూ చెప్పకనే చెప్పాడు ఏఆర్ రెహమాన్. చివరగా తెలుగులో ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నందుకు నిర్మాత దిల్‌రాజుకి థాంక్యూ చెప్పాడు. ఆడియన్స్ థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని ఆడియన్స్‌ని కోరాడు.