టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, ఏపీ మంత్రి పేర్నినానితో జరిపిన సమావేశం ముగిసింది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, సి.కల్యాణ్, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు పాల్గొన్నారు.
నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం నుంచి మంచి భరోసా లభించింది. ఆన్ లైన్ టిక్కెటింగ్ కావాలని మేమే అడిగాము. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఊతం ఇచ్చారు’ అని సి.కళ్యాణ్ తెలిపారు.
నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. ‘ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం గతంలో ఉండేది.. అయితే అప్పట్లో ఆప్షనుగా ఉండేది. ఇప్పుడు కంపల్సరీ చేయాలని మేమే కోరాం. ఇండస్ట్రీకి మేలు చేసే విషయంలో అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు. థియేటర్ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు’ అని ఆదిశేషగిరిరావు తెలిపారు.
నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం జరిగింది. చాలా ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో సమావేశం జరగడం తొలిసారి. విభజన తర్వాత సినిమా వాళ్లతో ఈ తరహా సమావేశం ఇప్పుడే జరిగింది. ప్రభుత్వమే ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయం చేయడం వల్ల ఇబ్బందేమీ లేదు. ఇప్పుడు బుక్ మై షోల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వాళ్లు.. ఇకపై ప్రభుత్వ వెబ్ సైటులోకి వెళ్లి బుక్ చేసుకుంటారు. టిక్కెట్ల ధరల పెంపుపై చర్చే జరగలేదు. థియేటర్ల మైంటైన్స్ విషయంలో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం’ అని ఎన్వీ ప్రసాద్ తెలిపారు.