ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించాలంటూ ప్రత్యేక జీవోను తెరపైకి తీసుకురావడం, దానిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకు ఎక్కారు. దాంతో కోర్టు ప్రభుత్వ జీవోను రద్దు చేస్తూ టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే ఏపీ గవర్నమెంట్ ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. గురువారం ఏపీ హైకోర్టులో టిక్కెట్ల ధరలపై విచారణ జరిగింది. అయితే హైకోర్టు ఈ విషయంపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
జిఓ 35 ఎందుకు ? టికెట్ రేట్లు ఏంటి ?
రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్లలో ప్రజలందరికీ టిక్కెట్లు అందుబాటులో ఉండాలని, అలాగే టాప్ స్టార్స్ సినిమాల బెనిఫిట్ షోలను ప్రదర్శించే సమయంలో టిక్కెట్ల రేటు భారీగా పెరగకుండా ఉండాలనే లక్ష్యంతో ఉంది. దానికోసమే ఈ జీవోను తెరపైకి తీసుకొచ్చింది. ఏపీలో ప్రభుత్వం సినిమా థియేటర్లలో ప్రవేశ రేట్లను నిర్ణయిస్తూ 08-04-2021 న జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారం కనిష్ట టికెట్ ధర రూ. 5 ఉండగా, గరిష్టంగా రూ.250 ఉంది. ఈ ధరలు మున్సిపాలిటీ, నగర పంచాయతీలు, మునిసిపల్ కార్పొరేషన్ పరిమితులలో మారుతూ ఉంటాయి. మునిసిపల్ కార్పొరేషన్ పరిథిలో థియేటర్లను బట్టి (మల్టీప్లెక్స్, ఏసీ, నాన్-ఏసీ) రేట్లు రూ.40 నుంచి రూ.250 మధ్య, మున్సిపాలిటీ పరిమితుల్లో టికెట్ ధరలు రూ.40 నుంచి రూ.50 మధ్య ఉన్నాయి. నగర పంచాయతీలలో రూ.10 నుంచి రూ.120 వరకు, గ్రామ పంచాయతీలలో రూ. 5 నుంచి రూ. 80 వరకు ఈ టికెట్ రేట్లు ఉన్నాయి.
Read Also : భారీ సంఖ్యలో థియేటర్లలోకి ‘పుష్ప’… బెనిఫిట్ షోలకు సర్వం సిద్ధం
కోర్టుకు వెళ్ళిందెవరు?
జిఓ 35ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం సస్పెండ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. థియేటర్ల యాజమాన్యం తరపున న్యాయవాది దుర్గాప్రసాద్ వాదిస్తూ టిక్కెట్ల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని, అది ఓనర్ల హక్కు అని అన్నారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన కోర్టు జిఒను సస్పెండ్ చేసింది. జిఒ 35ను సవాల్ చేస్తూ సినిమా థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సి.మానవేంద్రనాథ్ రాయ్‌తో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించే విషయంలో విఫలం అయిందంటూ జిఒ35ను సస్పెండ్ చేసింది. థియేటర్లలో అడ్మిషన్ల రేట్లను నిర్ణయించేందుకు రాష్ట్రహోం ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని గతంలో కోర్టు తన ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజానికి ప్రభుత్వ నిర్ణయంపై పరిశ్రమ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ అంశంపై పునరాలోచించాలని కోరారు. పరిశ్రమల పెద్దలు, చిరంజీవి వంటి కొంత మంది స్టార్లు ముఖ్యమంత్రికి, మంత్రి పేర్నికి పరిస్థితి వివరించినా ఫలితం లేకుండా పోయింది. 17న వచ్చే ‘పుష్ప’తో పాటు రాబోయే ‘ఆర్ఆర్ఆర్’ వంటి పెద్ద సినిమాలకు దీనివల్ల భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఇటీవల విడుదలై బాలకృష్ణ ‘అఖండ’ సినిమాకు ఈ టికెట్ రేట్ల వల్ల దాదాపు 8 కోట్ల వరకు నష్టం వచ్చిందని మార్కెట్ లో టాక్. దాంతో కొంత మంది ఎగ్జిబిటర్స్ కోర్టులో కేసు ఫైల్ చేయించారు.
కేసు వెనుక ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత దానయ్య!?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ఎగ్జిబిటర్స్ చేత కేసు ఫైల్ చేయించింది ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య అనేది బాగా ప్రచారంలో ఉంది. జనవరి 7న విడుదల కాబోయే తన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ఈ టికెట్ రేట్లు భారీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే లోకోపకారిగా కొంత మంది ఎగ్జిబిటర్స్ తో కోర్టులో కేసు ఫైల్ చేయించినట్లు టాక్. దానిపై హై కోర్టు కూడా స్పందించి ప్రభుత్వ జీవో 35ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం మళ్ళీ అప్సీలుకు వెళ్ళింది.
Rea also : “పుష్ప” ఫస్ట్ రివ్యూ అవుట్… ఎలా ఉందంటే ?
ప్రభుత్వం ఏమంటోంది?
సినిమా టికెట్ ధరల జీవో రద్దుపై ఏపీ హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఈ మేరకు లంచ్ మోషన్ ధాఖలు చేయగా, దానిపై విచారణ జరిపి సోమవారానికి వాయిదా వేసింది. ఈ జీవో రద్దు కాకుంటే తమ థియేటర్లు మూసేసుకోవలసి వస్తుందనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఎగ్జిబిటర్స్. త్వరలో విడుదల కానున్న బడా చిత్రాల నిర్మాతలు ప్రభుత్వం పట్టుదలకు పోకుండా జీవోను వెనక్కి తీసుకుంటుందేమోనని ఆశగా చూస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనిని ప్రస్టేజ్ గా తీసుకుని ముందుకు వెళుతోంది.
‘పుష్ప’రాజ్ కు నిరాశ
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ డిసెంబర్ 17న విడుదల కానుంది. ఆంధ్రప్రదేవ్ హైకోర్టు గురువారం జడ్జిమెంట్ ఇచ్చి ఉంటే అది ‘పుష్ప’కు ప్లస్ అయి ఉండేది. విచారణ కాస్తా వాయిదా పడడంతో ‘పుష్ప’రాజ్ కు షాక్ తప్పలేదు. దీని వల్ల ఈ సినిమాకు స్పెషల్ షోస్ ప్రదర్శించుకునే అవకాశం లేకపోగా టికెట్ రేట్లు కూడా పాతపద్ధతిలోనే ఉంటాయి. చివరి నిమిషం వరకూ సినిమా కోసం రాత్రి పగలూ తేడా లేకుండా పని చేస్తున్న చిత్రబృందానికి ఈ ట్విస్ట్ బాగా ఇబ్బందికరమైన విషయం. విచారణ సోమవారానికి వాయిదా పడటం వల్ల తొలి మూడు రోజుల్లో బన్నీ సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు తప్పవు. మరి సోమవారం నుంచైనా ‘పుష్ప’రాజ్ కి ఊరట లభిస్తుందేమో చూద్దాం.