Anupam Kher Joins Tiger Nageswara Rao: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇప్పుడు టాలీవుడ్ పైనా దృష్టి పెట్టారు. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘కార్తికేయ -2’లో కీలక పాత్ర పోషిస్తున్నారు అనుపమ్ ఖేర్. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కాబోతోంది. అలానే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మాస్ మహరాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’లోనూ ఆయన ఓ ప్రధాన పాత్రను పోషించబోతున్నారు. దీనికి సంబంధించిన స్టిల్ ను అనుపమ్ ఖేర్ మంగళవారం తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. తాను నటిస్తున్న 528వ చిత్రానికి సంబంధించిన విశేషాలు తెలియచేయడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
రవితేజ హీరోగా వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశేషం ఏమంటే… ‘కార్తికేయ -2’ తరహాలోనే ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా సైతం ఐదు భాషల్లో దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అనుపమ్ ఖేర్ తో ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రం నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మాత కావడం మరో విశేషం. మొత్తానికి అభిషేక్ అగర్వాల్ ‘కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2, టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలతో అనుపమ్ తో తన అనుబంధాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నారు.