అమ్మ కిచ్చిన మాటను, అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘అంతేనా… ఇంకేం కావాలి’. పవన్ కళ్యాణ్ బయ్యా ను హీరోగా పరిచయం చేస్తూ వెంకట నరసింహ రాజ్ దర్శకత్వంలో రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఝాన్వీ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ అతిరధుల సమక్షంలో ప్రారంభమైంది. సీనియర్ నటులు మురళీ మోహన్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నటుడు దగ్గుపాటి అభిరామ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్ ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ అందించారు.
చిత్ర దర్శకుడు వెంకట నరసింహ రాజ్ మాట్లాడుతూ, ”నేను వెంకటేష్ బాబుకు వీరాభిమానిని. ఎప్పటికైనా వెంకటేష్ గారితో సినిమా చెయ్యాలనే పట్టుదల ఉండడంతో మా గురువుగారు ఆర్. నారాయణ మూర్తి ఆశీస్సులతో డైరెక్టర్ అయ్యాను. ఈ బ్యానర్ లో ప్రస్తుతం ‘అల్లుడు బంగారం’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు చేస్తున్న ‘అంతేనా… ఇంకేం కావాలి’ నా రెండవ సినిమా. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయ డానికి ప్లాన్ చేస్తున్నాం. సీనియర్ నటులు సుమన్, కమెడియన్ సునీల్, బ్రహ్మాజీ, కరాటే కళ్యాణీ, జబర్దస్త్ టీం, గబ్బర్ సింగ్ టీం ఇందులో నటించబోతున్నారు” అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకున్నారు.