ఇప్పటికే నాలుగు చిత్రాలలో హీరోగా నటించిన గౌతంరాజు తనయుడు కృష్ణ ఇప్పుడు మరో సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. కృష్ణ, సుమీత జంటగా నటిస్తున్న ఈ సినిమాను అంజన్ చెరుకూరి దర్శకత్వంలో రావుల లక్ష్మణ్ రావ్, రావుల శ్రీను నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో మొదలైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు బి. గోపాల్, రేలంగి నరసింహారావు, గౌతంరాజు, ప్రసన్న కుమార్, రామ సత్య నారాయణ, డి ఎస్ రావు, నటి మాధవి తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఒక మధ్య తరగతి ప్రేమజంటకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మంచి ప్లాన్ తో చేజిక్కుంచుకొని ఎలా కోటేశ్వరులు అయ్యారన్నదే ఈ చిత్ర కథ అని దర్శకుడు అంజన్ తెలిపారు.
చిత్ర నిర్మాతలు లక్ష్మణ్ రావు, శ్రీనివాస్ మాట్లాడుతూ, ”మా అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే రోజు మా సినిమాను ప్రారంభించాలనుకుని, ఈ రోజు మొదలు పెట్టాం. మా మొదటి సినిమా ‘రుద్రవీణ’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ కథ నచ్చడంతో రెండవ ప్రాజెక్టు గా దీనిని నిర్మిస్తున్నాం. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్నాం” అని అన్నారు. హీరో కృష్ణ మాట్లాడుతూ, ”నా ఐదవ సినిమాకు బి. గోపాల్, రేలంగి నరసింహారావు వంటి లెజెండ్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్ర నిర్మాతలు నన్ను, దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారు మా పై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకుంటాం” అని చెప్పారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు హీరోయిన్ సుమీత ధన్యవాదాలు తెలిపింది.