Anirudh Ravichandran: కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రామచంద్రన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనిరుధ్ తాత, సీనియర్ దర్శకుడు, రేడియో డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎస్వీ రమణన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులుతెలిపారు. దీంతో అనిరుధ్ ఇంటనే కాకుండా కోలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. ఎస్వీ రమణన్ మొదట రేడియో జాకీగా పనిచేశారు. అంతేకాకుండా అనేక కార్యక్రమాలకు ఆయన తన గొంతును అరువిచ్చారు. ఇక తండ్రి లానే ఆయన కూడా దర్శకత్వం వైపు మొగ్గు చూపి పలు లఘు చిత్రాలకు, భక్తిరస డాక్యూమెంటరీలకు దర్శకత్వం వహించారు.
1983 సంవత్సరంలో ఊరువంగల్ మరాళం అనే సినిమాతో మంచి పేరును తెచ్చుకున్నాడు రమణన్. ఇక ఆయనకు ఇద్దరు కుమార్తెలు.. లక్ష్మీ, పార్వతి. పెద్ద కుమార్తె లక్ష్మీ కుమారుడే అనిరుధ్. చిన్నతనం నుంచి అనిరుధ్ ఎక్కువ తాత వద్దనే పెరిగాడు. ఆయనతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు నిత్యం అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక రమణన్ సైతం గతంలో తన మనవడు ఇంత గొప్ప సంగీత దర్శకుడు అయ్యినందుకు సంతోషిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తాత మరణంతో అనిరుధ్ కృంగిపోయినట్లు తెలుస్తోంది. నేటి సాయంత్రం చెన్నైలో ఆయన ఆంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విషయం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.